ఆశ్రమ పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:49 PM
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల నిర్వహణ మెరుగుపడాలని, తాజా పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ అన్నారు.

ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ
టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
పాడేరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల నిర్వహణ మెరుగుపడాలని, తాజా పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో ఏజెన్సీలోని విద్యపై ఆయా శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 10 ఆశ్రమ పాఠశాలలు తనిఖీ చేశానని, సాయంత్రం ఐదు గంటలకు అక్కడ ఉపాధ్యాయులు ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా స్టడీ అవర్ నిర్వహించే, సూపర్‌వైజరీ సబ్జెక్టు టీచర్లు అందుబాటులో ఉండడం లేదన్నారు. టెన్త్ విద్యార్థులకు ప్రెంచి విప్లవం గురించి అడిగితే జవాబు చెప్పలేకపోతున్నారని, కొంత మంది ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించ డం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజన మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల కు రాగి మాల్ట్ సరఫరా చేయడం లేదన్నారు. ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వాళ్లు ఏ కేటగిరీలో ఉన్నారనేది ప్రధానోపాధ్యాయులకు అవగాహన ఉండాల న్నారు. మండల విద్యాశాఖాధికారులు సైతం ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల విద్యాప్రమాణాలను పరిశీలించాలని జిల్లా విద్యాశాఖాధికారికి ఆయన సూచించారు. విద్యాప్రమాణాల మెరుగుకు ప్రధానోపాధ్యాయు లు వారానికి ఒకసారి ఆయా ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో సఖీ గ్రూపులు ఏర్పాటు చేశామని, వాటి సమావేశాలు నిర్వహించి బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. రక్తహీనత, బాల్య వివాహాలు, పోక్సో చట్టం గురించి బాలికలకు వివరించాలని, మార్గదర్శిని కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కెరీర్ గైడెన్సుపై అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు 8, 9 తరగతుల్లోని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆయన ఆదేశించారు.
మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యల తీసుకుంటామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ హెచ్చరించారు. పాఠశాలలకు చక్కని ఫలితాలు రావాలనే ఆలోచనతో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పాస్ చేయిస్తామని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజిరావు, సమగ్ర శిక్షా ఏపీజీ డాక్టర్ స్వామినాయుడు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎల్.రజని, ఏజెన్సీ 11 మండలాలకు చెందిన ఏటీడబ్ల్యూవోలు, ఎంఈవోలు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకులాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.