వడ్డాది-తాటిపర్తి రోడ్డుకి మహర్దశ
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:27 AM
వడ్డాది -పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో భాగమైన మండలంలో తాటిపర్తి నుంచి బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు వెడల్పు ఐదున్నర మీటర్లు వుండగా, ఇరువైపులా ఒక్కో మీటరు చొప్పున విస్తరిస్తున్నారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో చేపట్టిన ఈ రోడ్డు పనులు ఈ ఏడాది ఏప్రిల్‌లోగా పూర్తవుతాయని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.

శరవేగంగా విస్తరణ, అభివృద్ధి పనులు
14 కిలోమీటర్లు.. రూ.23.59 కోట్ల ఏడీబీ నిధులు
ప్రస్తుత రహదారి ఐదున్నర మీటర్లు
ఇరువైపులా మీటరు చొప్పున విస్తరణ
ఏప్రిల్ చివరినాటికి పనులు పూర్తి
మూడు జిల్లాల వాసులకు తీరనున్న రవాణా ఇక్కట్లు
మాడుగుల రూరల్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వడ్డాది -పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో భాగమైన మండలంలో తాటిపర్తి నుంచి బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు వెడల్పు ఐదున్నర మీటర్లు వుండగా, ఇరువైపులా ఒక్కో మీటరు చొప్పున విస్తరిస్తున్నారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో చేపట్టిన ఈ రోడ్డు పనులు ఈ ఏడాది ఏప్రిల్‌లోగా పూర్తవుతాయని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.
మైదాన ప్రాంతంతో ఏజెన్సీని అనుసంధానించే వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రహదారిపై ఉమ్మడి మూడు జిల్లాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మాడుగుల మండల ప్రజలు చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు ఈ రోడ్డులోనే వెళ్లాలి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లోని పలు మండలాల ప్రజలు మైదాన ప్రాంతానికి ఈ రోడ్డు గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. కాగా అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దులోని మాడుగుల మండలం తాటిపర్తి నుంచి ఘాట్ రోడ్డు మొదలవుతుంది. ఇక్కడి నుంచి పాడేరు వరకు రోడ్డు బాగానే వుంది. అయితే ఇటువైపు తాటిపర్తి నుంచి వడ్డాది వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. సుమారు 14 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు 2021 ఫిబ్రవరిలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు రుణం రూ23.59 కోట్లు మంజూరైంది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తరువాత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌తో ఆర్‌అండ్‌బీ అధికారులు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే అప్పటికే పనులు మొదలుపెట్టిన బీఎన్ రోడ్డుకు బిల్లులు మంజూరు కాకపోవడంతో ఈ రోడ్డు కాంట్రాక్టర్ చాలా రోజుల వరకు పనులు ప్రారంభించలేదు. రహదారిపై గోతులు పెరిగిపోయి వడ్డాది నుంచి తాటిపర్తి వరకు ప్రయాణించడానికి వాహనదారులకు గంట సమయం పట్టేది. ఈ సమస్య నాటి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బూడి ముత్యాలనాయుడు దృష్టికి రావడంతో రోడ్డుపై కనీసం గోతులు అయినా కప్పించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్ సిమెంట్ కాంక్రీట్ మిక్చర్‌తో అక్కడక్కడా గోతులు కప్పించారు. అయితే వాటరింగ్ సరిగా చేయకపోవడంతో కొద్ది రోజులకే పిక్కలు లేచిపోయి దుమ్ము, ధూళి సమస్య అధికమైంది. ఈ పనులకు బిల్లు రాకపోవడంతో మిగిలిన పనులు కొనసాగించలేదు.
కూటమి ప్రభుత్వం రాకతో రోడ్డుకు మోక్షం
ఈ నేపథ్యంలో గత ఏడాది సాధారణ ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బండారు సత్యనారాయణమూర్తి వడ్డాది- తాటిపర్తి రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు పనులు పునఃప్రారంభించేలా గతంలో టెండర్ పొందిన కాంట్రాక్టర్‌నుఒప్పించారు. గత ఏడాది డిసెంబరు ఐదో తేదీన ఆయనతోపాటు కలెక్టర్ విజయకృష్ణన్ ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తరువాత రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. వడ్డాది నుంచి తాటిపర్తి వరకు రోడ్డుకు ఇరువైపులా ఒక్కో మీటరు చొప్పు విస్తరిస్తున్నారు. సుమారు రెండు అడుగుల మేర మట్టిని పూర్తిగా తొలగించి సిమెంట్ కాంక్రీట్ మిక్చర్ వేసి రోలింగ్ చేస్తున్నారు. అనంతరం పాత రోడ్డుతోపాటు మొత్తం తారు రోడ్డు వేస్తారు. ప్రస్తుతం ఐదున్నర మీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డు, విస్తరణ తరువాత ఏడున్నర మీటర్లకు పెరుగుతుంది. భారీ వాహనాలు ఎదురైనా ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు సాగిపోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు పూర్తవుతాయని ఆర్‌అండ్‌బీ నర్సీపట్నం డీఈఈ విద్యాసాగర్ తెలిపారు.