కల్లు గీత కులాలకు మద్యం దుకాణాలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:15 AM
జిల్లాలో కల్లు గీత కులాలకు జనాభా దామాషా పద్ధతిలో లాటరీ ప్రక్రియ ద్వారా 15 మద్యం దుకాణాలను కేటాయించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్లు గీత ఉప కులాల నాయకుల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు.

లాటరీ ద్వారా కేటాయింపు
శెట్టిబలిజ-9, యాత-4, గౌడ-1, గౌడ్-1
ఐదో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ
ఏడో తేదీన లాటరీ ద్వారా ఎంపిక
అనకాపల్లి కలెక్టరేట్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కల్లు గీత కులాలకు జనాభా దామాషా పద్ధతిలో లాటరీ ప్రక్రియ ద్వారా 15 మద్యం దుకాణాలను కేటాయించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్లు గీత ఉప కులాల నాయకుల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2024-26 ఆబ్కారీ సంవత్సరానికి సంబంధించి మద్యం షాపులను లాటరీ ద్వారా పారదర్శక కేటాయించామన్నారు. అనకాపల్లి జిల్లాలో శెట్టిబలిజ, యాత, గౌడ్, గౌడ అనే నాలుగు కల్లు గీత ఉప కులాలను గుర్తించినట్టు చెప్పారు. వీరిలో శెట్టిబలిజలకు తొమ్మిది, యాతలకు నాలుగు, గౌడలకు ఒకటి, గౌడ్‌లకు ఒకటి చొప్పున మొత్తం 15 మద్యం దుకాణాలను కేటాయించామన్నారు. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని, దుకాణాల ఏర్పాటుకు (ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్/ హైబ్రిడ్‌మోడ్) ఫిబ్రవరి ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ వుంటుందని ఆమె అన్నారు. ఫిబ్రవరి ఆరో తేదీన దరఖాస్తుల పరిశీలన, ఏడో తేదీన లాటరీ ప్రక్రియ ద్వారా షాపుల కేటాయింపు వుంటుందని చెప్పారు.
ఏ దుకాణం.. ఏ కులానికి..
శెట్టిబలిజ కులం వారికి అనకాపల్లి రూరల్, నక్కపల్లి, నాతవరం, చీడికాడ, వి.మాడుగుల, మునగపాక, కశింకోట, రాంబిల్లి, బుచ్చెయ్యపేట కేటాయించారు. యాత కులం వారికి రోలుగుంట, పాయకరావుపేట, దేవరాపల్లి, రావికమతం; గౌడ కులం వారికి మాకవరపాలెం, గౌడ్ కులం వారికి ఎలమంచిలి కేటాయించారు.