Share News

సాగునీటి వనరులకు జీవం

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:30 PM

మన్యంలో సాగునీటి వనరులకు జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏజెన్సీలోని చెక్‌డ్యామ్‌లు, మినీ రిజర్వాయర్లకు మరమ్మతులు చేపట్టేందుకు కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ కనబరచి ఇప్పటికే రెండు విడతలుగా రూ.20 కోట్ల 11 లక్షలను మంజూరు చేశారు.

సాగునీటి వనరులకు జీవం
చింతపల్లి మండలం తాజంగి రిజర్వాయర్‌ ఎడమ కాలువ పనులు జరుగుతున్న దృశ్యం

చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వం

చెక్‌డ్యామ్‌లు, మినీ రిజర్వాయర్ల మరమ్మతులకు రూ.20.11 కోట్లు మంజూరు

కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో ఉపాధి హామీ పథకం నిధులతో పనులు

ఈ ఏడాది ఖరీఫ్‌కు సాగునీరు అందించేందుకు ఎస్‌ఎంఐ అధికారుల కసరత్తు

గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ సాగునీటి రంగంపై నిర్లక్ష్యం

వర్షాలపైనే ఆధారపడిన గిరిజన రైతులు

కూటమి సర్కారు పనులు చేపట్టడంతో ఆనందం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో సాగునీటి వనరులకు జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏజెన్సీలోని చెక్‌డ్యామ్‌లు, మినీ రిజర్వాయర్లకు మరమ్మతులు చేపట్టేందుకు కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ కనబరచి ఇప్పటికే రెండు విడతలుగా రూ.20 కోట్ల 11 లక్షలను మంజూరు చేశారు. వాటితో 146 పనులు చేపట్టి, ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చిన్ననీటి పారుదల శాఖ(ఎస్‌ఎంఐ)అధికారులు చర్యలు చేపడుతున్నారు.

గిరిజన ప్రాంతంలో సాగునీటి వనరులపై గత వైసీపీ ప్రభుత్వం అందులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏజెన్సీలోని సాగునీటి రంగానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఏజెన్సీ పదకొండు మండలాల పరిధిలో 1,566 చిన్న తరహా సాగునీటి(చెక్‌ డ్యామ్‌లు) వనరులున్నాయి. వాటి పరిధిలో 66 వేల ఎకరాల్లో ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. అయితే ఆయా సాగునీటి వనరులు ఏడాది విడిచి ఏడాదికొకసారి మరమ్మతులకు గురవుతుంటాయి. ఫలితంగా సాగునీరు పంట పొలాలకు అందకుండా వృథాగా పోతుంటాయి. ఈ తరుణంలో ఆయా సాగునీటి వనరులకు అవసరమైన మరమ్మతులను చిన్న తరహా సాగునీటి పారుదల శాఖ అధికారులు చేపడతారు. కానీ వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏజెన్సీలో సగానికి పైగా సాగునీటి వనరులు మరమ్మతులకు గురయ్యాయి.

ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు కేటాయించినా దక్కని ఫలితం

వైసీపీ ప్రభుత్వం ఒక అసెంబ్లీ స్థానం పరిధిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.20 కోట్లు కేటాయించినా, వాటిలో సైతం సాగునీటి వనరుల మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. నియోజకవర్గానికి కేటాయించిన మొత్తం నిధులను కేవలం మెటల్‌ రోడ్డు, సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలకు మాత్రమే కేటాయించారు. ఒక్క కోటి రూపాయలు కూడా సాగునీటి రంగానికి కేటాయించకపోవడం గమనార్హం. దీంతో గిరిజన రైతులు కేవలం వర్షాధారంగానే వ్యవసాయాన్ని చేయాల్సిన పరిస్థితి వైసీపీ హయాంలో కొనసాగింది.

కూటమి హయాంలో రూ.20.11 కోట్లు మంజూరు

ఏజెన్సీలో సాగునీటి వనరులకు జీవం పోయాలనే ఆలోచనతో జాతీయ ఉపాధి పథకం ద్వారా ఏజెన్సీలోని 146 చెక్‌డ్యామ్‌లు/మినీ రిజర్వాయర్‌లకు మరమ్మతులు చేపట్టేందుకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ రెండు విడతలుగా రూ.20 కోట్ల 11 లక్షలు మంజూరు చేశారు. తొలి విడతలో రూ.12 కోట్ల వ్యయంతో 76 పనులు మంజూరు కాగా, రెండో విడతలో రూ.8కోట్ల 11 లక్షలతో 70 పనులను మంజూరు చేశారు. మొత్తం 146 పనులు పూర్తయితే వాటి పరిధిలోని ఉన్న 7,483 ఎకరాల పంట భూములను సాగునీరు అందుతుందని ఎస్‌ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే ఆయా పనులు ప్రగతిలో ఉండగా, ఈ వేసవిలో చెక్‌డ్యామ్‌లు/మినీ రిజర్వాయర్ల మరమ్మతులను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి సాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన ప్రాంతంలో సాగునీటి వనరులకు మరమ్మతులు జరుగుతుండడంపై గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:30 PM