Share News

చందనోత్సవం విజయవంతానికి కృషి చేద్దాం

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:26 AM

వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చందనోత్సవాన్ని విజ.యవంతం చేసేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని సింహాచల దేవస్థానం అధికారులకు కార్యనిర్వాహణాధికారి కె సుబ్బారావు దిశానిర్దేశం చేశారు. గత అనుభవాలను పాఠాలుగా చేసుకుని అందరూ ముందుకు సాగుదామన్నారు.

చందనోత్సవం విజయవంతానికి కృషి చేద్దాం
సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న ఈవో సుబ్బారావు

గత అనుభవాలను పాఠాలుగా చేసుకుని ముందుకెళదాం..

సింహాచల దేవస్థానం ఈవో కె.సుబ్బారావు

సింహాచలం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చందనోత్సవాన్ని విజ.యవంతం చేసేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని సింహాచల దేవస్థానం అధికారులకు కార్యనిర్వాహణాధికారి కె సుబ్బారావు దిశానిర్దేశం చేశారు. గత అనుభవాలను పాఠాలుగా చేసుకుని అందరూ ముందుకు సాగుదామన్నారు. వచ్చే నెల 30న జరగనున్న అప్పన్నస్వామి చందనోత్సవ కార్యక్రమ నిర్వహణపై గురువారం సింహగిరిపై వివిధ శాఖల అధికారులతో ఈవో ప్రత్యేకంగా సమీక్ష సమవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో చందనోత్సవం విజయానికి, ఇబ్బందులకు గల కారణాలను పలువురు అధికారులు ప్రస్తావించారు. వాటినన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అధిగమించాలని, ఇందుకోసం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఈవో సూచించారు. ప్రధానంగా క్యూ లైన్ల నిర్వహణ, ట్రాఫిక్‌ సమస్యలు, డిప్యూటేషన్‌ సిబ్బంది వినియోగం.. వాళ్లకు వసతి, తదితర సౌకర్యాల కల్పన, సేవా సంఘాలకు అందజేయాల్సిన సహకారం, టికెట్ల డూప్లికేటింగ్‌ను అరికట్టడం, పోలీస్‌ బందోబస్తు, భక్తులకు తాగునీరు, ఆహార పదార్థాలను సమకూర్చడం, ప్రసాదాలు, నిత్యాన్న ప్రసాదం, తదితర అనేక అంశాలపై సమగ్రంగా చర్చించారు. భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలపై ప్రతిపాదనలను రూపొందించాలని సంబందిత విభాగాధికారులకు ఈవో ఆదేశించారు. సమావేశంలో దేవస్థానం డిప్యూటీ ఈవో సింగం రాధ, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కార్యనిర్వాహక ఇంజనీర్లు దండ గణ శ్రీనివాసరాజు, బండారు రాంబాబు, పలు విభాగాల ఏఈవోలు, పర్యవేక్షణాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:26 AM