Share News

వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా కన్నబాబు

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:39 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా కన్నబాబు

  • పార్టీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ

విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో కొనసాగిన విజయసాయిరెడ్డి ఇటీవల వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో పార్టీ అధిష్ఠానం కన్నబాబును నియమించిన విషయం తెలిసిందే. కాగా ఊరేగింపుగా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు, అరకు ఎంపీ డాక్టర్‌ తనూజారాణి, విజయనగరం జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, తైనాల విజయ్‌కుమార్‌, కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్‌కుమార్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఎనిమిది నెలలకే కూటమి ప్రభుత్వం ప్రజల్లో పరపతిని కోల్పోయిందని విమర్శించారు. ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల కంటే వైసీపీ బలంగా ఉందన్నారు. ఒక్క గ్యాస్‌ మినహా సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏదీ అమలుచేయలేదన్నారు. అయినప్పటికీ రూ.1.2 లక్షల కోట్లు అప్పుచేశారని ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 24 , 2025 | 12:39 AM