రోడ్డు ప్రమాదంలో కలాసీల మేస్ర్తి మృతి
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:00 AM
అచ్యుతాపురం జంక్షన్‌కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మోసయ్యపేటకు చెందిన పంచదార్ల అప్పడు అచ్యుతాపురంలో కలాసీలకు మేస్ర్తి. గురువారం ఉదయం ఇంటి వద్ద నుంచి అచ్యుతాపురం జంక్షన్ వైపు నడుచుకుంటూ వెళుతుండగా, అనకాపల్లి వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొన్నది.

అచ్యుతాపురం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం జంక్షన్‌కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మోసయ్యపేటకు చెందిన పంచదార్ల అప్పడు అచ్యుతాపురంలో కలాసీలకు మేస్ర్తి. గురువారం ఉదయం ఇంటి వద్ద నుంచి అచ్యుతాపురం జంక్షన్ వైపు నడుచుకుంటూ వెళుతుండగా, అనకాపల్లి వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొన్నది. దీంతో తీవ్ర గాయలైన ఆయనను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో గాజువాకలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పంచదార్ల అప్పడు కుమారుడు పైడిరాజు ప్రస్తుతం మోసయ్యపేట సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాటిచెట్టు పడి రైతు మృతి
కొత్తూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బవులవాడలో తాటిచెట్టు పడి రైతు మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి అనకాపల్లి రూరల్ ఎస్‌ఐ జి.రవికుమార్ తెలిపిన వివరాలిలా వున్నాయి. బవులవాడ గ్రామానికి చెందిన గొల్లవిల్లి అప్పారావు (57) గురువారం పొలంలో గేదెలు మేపుతున్నాడు. ఈ క్రమంలో అక్కడ వున్న ఒక తాటిచెట్టు కూలిపోయి ఇతనిపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే అనకాపల్లిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు విశాఖపట్నం తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. ఇతని కుమారుడు గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
కాపురానికి భర్త వద్దన్నాడని ఆత్మహత్యాయత్నం
రావికమతం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): భర్త కాపురానికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని మేడివాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడివాడ గ్రామానికి చెందిన వేములపూడి సువర్ణ, దొండపూడి గ్రామానికి చెందిన మజ్జి మోహన్ ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఇరు కుటుంబాల వారు కాదనడంతో వారిని ఎదిరించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా విశాఖపట్నంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక కుమారుడు కలిగాడు. ప్రస్తుతం సువర్ణ ఆరు నెలల గర్భవతి. రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో సువర్ణను వదిలి మోహన్ చెన్నై వెళ్లిపోయాడు. దీంతో సువర్ణ కొడుకును తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. భర్త తనను వదిలి రెండో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఆమె స్పందనలో ఫిర్యాదు చేసింది. రావికమతం పోలీసులు మోహన్‌ను స్టేషన్‌కు రప్పించి రెండో పెళ్లికి సిద్ధపడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించి, సువర్ణను వెంట తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సువర్ణ పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు రావికమతం పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. ప్రాథమిక వైద్యం అనంతరం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గర్భిణి కావడంతో మెరుగైన వైద్యం అవసరమని విశాఖ కేజీహెచ్‌కు పంపారు.
గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్లు జైలు శిక్ష
చోడవరం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు ముద్దాయిలకు పది సంవత్సరాలపాటు కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎ.రత్నకుమార్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలం బొండాం గ్రామానికి చెందిన గొల్లూరి వీరాస్వామి, పంచాడి సునీల్ కుమార్ 2013 డిసెంబరు 3న ఆర్టీసీ బస్సులో 20 కిలోల గంజాయి రవాణా చేస్తూ అనంతగిరి పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు న్యాయస్థానంలో చార్జీషీటు దాఖలు చేశారు. నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. లక్ష రూపాయల జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండున్నర సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి ఆదేశించారు. ఈ కేసును పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉగ్గిన వెంకటరావు వాదించారు.