నిండుకుండలా జోలాపుట్టు జలాశయం
ABN , Publish Date - Jan 12 , 2025 | 10:59 PM
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన జలాశయంతో పాటు స్పిల్‌వే డ్యాం నీటితో కళకళలాడుతున్నాయి.

ముంచంగిపుట్టు, జనవరి 12(ఆంధ్రజ్యోతి) : ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు ప్రధాన జలాశయంతో పాటు స్పిల్‌వే డ్యాం నీటితో కళకళలాడుతున్నాయి. గతేడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో ఆయా జలాశయాల్లోకి వరదనీరు ఇన్‌ఫ్లో పెరగడం వల్ల ఈ ఏడాది జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. జోలాపుట్టు జలాశయంలో 2750 అడుగులు నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ఆదివారం 2744.15 అడుగులు నీటిమట్టం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ జలాశయంలో 2721.65 అడుగులు నీరు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 23 అడుగుల నీరు అధికంగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలాగే ఈ జలాశయానికి దిగువ ప్రాంతంలో గల డుడుమ జలాశయంలో 2590 అడుగులు నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2581.30 అడుగుల నీటిమట్టం నమోదైంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన నీటిని డుడుమ నుంచి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసినా విద్యుత్ ఉత్పాదనకు ఎటువంటి నీటి సమస్య తలెత్తే అవకాశం ఉండకపోవచ్చునని ప్రాజెక్టు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.