Share News

గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:24 PM

గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీసుశాఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నదని స్థానిక అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నవజ్యోతి మిశ్రా తెలిపారు.

గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు
ప్రేరణ కార్యక్రమంలో నిరుద్యోగ యువతనుద్దేశించి మాట్లాడుతున్న ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా

రెండో విడత ప్రేరణలో ప్రైవేటు కంపెనీల్లో 395 మంది ఎంపిక

చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా

చింతపల్లి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీసుశాఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నదని స్థానిక అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నవజ్యోతి మిశ్రా తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ ఆదేశాలతో రెండో విడత ప్రేరణ కార్యక్రమంలో భాగంగా మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్‌మేళాకు కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల నుంచి గిరిజన యువతీ, యువకులు 415 మంది హాజరుకాగా, 395 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో పది, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన యువతీ, యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారని పోలీసుశాఖ గుర్తించిందన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖ ప్రేరణ కార్యక్రమం ద్వారా గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదన్నారు. జాబ్‌మేళాలకు హాజరైన యువతీ, యువకులకు ఇన్నోవ్‌ సోర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి అర్హతల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేసినట్టు చెప్పారు. ఎంపికైన గిరిజన యువతకు బెంగళూరు, హైదరాబాద్‌ టాటా ఎలకా్ట్రనిక్స్‌, మిల్కీ మిస్ట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. నెలకు రూ.18,900 వేతనం చెల్లించడంతో పాటు భోజన, వసతి సదుపాయం కంపెనీ కల్పిస్తుందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపని నిరుద్యోగ యువతకు విశాఖపట్నం, హైదరాబాద్‌ నగరాల్లో డీమార్టు, ఎంఅండ్‌ఎం, బ్యాంకింగ్‌, లోకల్‌ క్రెడిట్‌ కార్డు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ డి.వినిత మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన నిరుద్యోగ యువత మధ్యలో గృహాలకు వచ్చేయడం మంచి పద్ధతికాదన్నారు. చిన్న ఉద్యోగంలో చేరి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, కొయ్యూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు ఎం.వినోద్‌ బాబు, పీవీ రమణ, ఎస్‌ఐలు వి.వెంకటేశ్వరరావు, వీరబాబు ఇన్నోవ్‌ సోర్స్‌ ప్రైవేటు కంపెనీ హెచ్‌ఆర్‌ ప్రవీణ్‌కుమార్‌, మేనేజర్‌ ఉన్నికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:24 PM