Share News

వాల్టాకు తూట్లు!

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:16 AM

మండలంలోని గొల్లలపాలెంలో సహజసిద్ధంగా ఏర్పడిన నీటి వనరులు కనుమరుగవుతున్నాయి. ఈ ప్రాంతంలో లేఅవుట్లు వేసిన కొంతమంది రియల్టర్లు.. గెడ్డలు, వాగులను కప్పేసి, వెంచర్లలోకి రోడ్లు నిర్మించుకుంటున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. చట్టప్రకారం చర్యలు తీసుకోవడంలేదు. గెడ్డలు, వాగులు పూడ్చివేయడం వల్ల వర్షాలు కురిసినప్పుడు గెడ్డ నీరు పంట పొలాలను ముంచేస్తున్నదని రైతులు వాపోతున్నారు.

వాల్టాకు తూట్లు!
గొల్లలపాలెం సర్వే నంబరు 120లోని గెడ్డవాగును ఆక్రమించి నిర్మించిన రహదారి

యథేచ్ఛగా గెడ్డలు, వాగులు కబ్జా చేస్తున్న రియల్టర్లు

వెంచర్లలోకి దర్జాగా రహదారుల నిర్మాణం

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్న రెవెన్యూ అధికారులు

కనుమరుగవున్న సహజసిద్ధ నీటి ప్రవాహాలు

సబ్బవరం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొల్లలపాలెంలో సహజసిద్ధంగా ఏర్పడిన నీటి వనరులు కనుమరుగవుతున్నాయి. ఈ ప్రాంతంలో లేఅవుట్లు వేసిన కొంతమంది రియల్టర్లు.. గెడ్డలు, వాగులను కప్పేసి, వెంచర్లలోకి రోడ్లు నిర్మించుకుంటున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. చట్టప్రకారం చర్యలు తీసుకోవడంలేదు. గెడ్డలు, వాగులు పూడ్చివేయడం వల్ల వర్షాలు కురిసినప్పుడు గెడ్డ నీరు పంట పొలాలను ముంచేస్తున్నదని రైతులు వాపోతున్నారు.

గొల్లలపాలెం సర్వే నంబరు 219లో 24.25 ఎకరాలు గెడ్డ వాగు పోరంబోకు/ప్రభుత్వ భూమి ఉంది. దీనికి ఎగువన వున్న జిరాయితీ భూమిని (సర్వే నంబర్లు 216, 218) ఒక వ్యక్తి కొనుగోలు చేసి, లే-అవుట్‌ వేశారు. ఇందులోకి వాహనాలు వెళ్లడానికి రోడ్డు సదుపాయం కొంతమంది స్థానిక నేతల సహకారంతో సర్వే నంబరు 219లోని గెడ్డవాగును కబ్జా చేసి రహదారి నిర్మించారు. దీనిపై గొల్లలపాలెం రైతులు 2023 డిసెంబరులో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. కానీ కబ్జాదారునిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో కొద్ది రోజుల తరువాత మళ్లీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామస్థులు మరోసారి తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారి స్పందించి లే-అవుట్‌కు ఏర్పాటు చేసిన రోడ్డుకు అడ్డంగా తవ్వేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో గెడ్డ వాగులోనే కొంచెం అవతలవైపు నుంచి తాత్కాలికంగా రహదారి ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు తీసేశారు. మరోవైపు పంచాయతీ అనుమతులు లేకుండా లేఅవుట్‌ వేసినవారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానిక రైతులు చెబుతున్నారు.

ఇదే గ్రామంలో సర్వే నంబరు 120లో 10.63 ఎకరాల గెడ్డ వాగు పోరంబోకు భూమి ఉంది. దీనిని ఇటీవల కొంత మంది ఆక్రమించి, చెట్లు నరికివేసి చదును చేశారు. ఈ ఆక్రమణ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

గొల్లలపాలెంలో సర్వే నంబరు 31లో 4.62 ఎకరాలు గెడ్డ వాగు పోరంబోకు భూమి ఉంది. ఇది గ్రామానికి అనుకొని ఉండడంతో గతంలో ఆక్రమించుకొన్న స్థానికులు కొంతమంది ప్రస్తుతం షెడ్లు నిర్మిస్తున్నారు. ఇంకా గ్రామాన్ని అనుకొని ఉన్న సర్వే నంబరు 249లో 69 సెంట్లు గెడ్డవాగు ఉంది. గతంలో ఇది కబ్జాకు గురవుతుంటే అప్పటి రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. ప్రస్తుతం ఆ బోర్డు కనిపించడం లేదు. సర్వే నంబరు 224లో 3.99 ఎకరాలు (సంపద కేంద్రం సమీపంలో) గెడ్డవాగు ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కొంతమంది ఆక్రమించగా.. గతంలో వీఆర్వో హెచ్చరిక బోర్డు పెట్టారు. కొద్ది రోజులకే కబ్జాదారులు బోర్డును పీకేశారు.

Updated Date - Feb 17 , 2025 | 12:16 AM