Share News

అందుబాటులోకి జల్లూరు వంతెన

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:58 AM

మండలంలోని జల్లూరు వద్ద వరహా నదిపై కొత్త వంతెన ఎట్టకేలకు ఏడేళ్ల తరువాత అందుబాటులోకి వచ్చింది. ప్రధాన వంతెన పనులు గత టీడీపీ హయాంలోనే పూర్తికాగా, వైసీపీ ఐదేళ్ల పాలనలో మిగిలిన పనుల్లో ఒక్కటి కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధులు మంజూరు చేయడంతో అప్రోచ్‌ రోడ్ల పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం మట్టి రోడ్డు నిర్మాణం పూర్తవడంతో వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతిస్తున్నారు.

అందుబాటులోకి జల్లూరు వంతెన
అప్రోచ్‌ రోడ్డు మట్టి పనులు పూర్తికావడంతో వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలు

అప్రోచ్‌ రోడ్ల మట్టి పనులు పూర్తి

వాహనాల రాకపోకలకు అనుమతి

సంక్రాంతిలోగా తారు రోడ్డు, రక్షణ గోడల నిర్మాణం

ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఎంపీ సీఎం రమేశ్‌

ప్రయాణికుల పదేళ్ల ఇక్కట్లకు తెర

కోటవురట్ల, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జల్లూరు వద్ద వరహా నదిపై కొత్త వంతెన ఎట్టకేలకు ఏడేళ్ల తరువాత అందుబాటులోకి వచ్చింది. ప్రధాన వంతెన పనులు గత టీడీపీ హయాంలోనే పూర్తికాగా, వైసీపీ ఐదేళ్ల పాలనలో మిగిలిన పనుల్లో ఒక్కటి కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధులు మంజూరు చేయడంతో అప్రోచ్‌ రోడ్ల పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం మట్టి రోడ్డు నిర్మాణం పూర్తవడంతో వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతిస్తున్నారు.

మండలంలోని జల్లూరు వద్ద వరహా నదిపై బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన వంతెన శిథిలస్థితికి చేరడంతో కొత్త వంతెన నిర్మాణానికి 2014లో నాటి టీడీపీ ప్రభుత్వం రూ.4.5 కోట్లు మంజూరు చేసింది. అయితే టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయిన తరువాత టెండర్‌ దక్కని కాంట్రాక్టర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో మూడేళ్లపాటు వంతెన నిర్మాణ పనులు మొదలుకాలేదు. తరువాత అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకుని, కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా కృషి చేశారు. వంతెన నిర్మాణ పనులకు 2018 జనవరి 5వ తేదీన శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరినాటికి రూ.2.3 కోట్ల మేర పనులు పూర్తికావడంతో ఆ మేరకు బిల్లులు మంజూరయ్యాయి. తదుపరి పనులు కొనసాగిస్తుండగా సాధారణ ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. దాదాపు మూడేళ్లపాటు వంతెన నిర్మాణం విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. తరువాత 2023 మార్చిలో నిర్మాణ పనులను పునఃప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పాత రేట్లకు పనులు చేయలేనని కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. అంతేకాక అగ్రిమెంట్‌ గడువు ముగిసినందున టెండర్‌ రద్దు చేయాలని ఆయన కోరారు. తరువాత నాటి వైసీపీ పాలకులు పట్టించుకోలేదు.. కొత్త వంతెన అందుబాటులోకి రాలేదు.

ఈ నేపథ్యంలో గత ఏడాది ఎన్నికల సందర్భంగా అనకాపల్లి ప్రస్తుతం ఎంపీ సీఎం రమేశ్‌.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జల్లూరు వంతెన నిర్మాణ పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయర ఎంపీగా గెలిచిన తరువాత ఆగస్టులో జల్లూరు వంతెనను పరిశీలించారు. పెండింగ్‌ పనులకు నిధులు ఎంతమేర అవసరం అవుతాయో ఆర్‌అండ్‌బీ అధికారులతో అంచనాలు తయారు చేయించారు. తనకు తెలిసిన కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఎంపీ ల్యాడ్స్‌ లేదా సీఎస్‌ఆర్‌ నిధులు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చి పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం కొద్ది రోజులకే పనులు మొదలయ్యాయి. అయితే తరచూ వర్షాలు కురుస్తుండడంతో మందకొడిగా సాగాయి. సుమారు పది రోజుల నుంచి వర్షాలు పడకపోవడంతో పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం గ్రావెల్‌తో అప్రోచ్‌ రోడ్లు నిర్మించారు. దీనిపై సిమెంట్‌ మిక్చర్‌, ఆపైన తారు రోడ్డు వేస్తారు. ఇదే సమయంలో రోడ్డుకి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మిస్తారు. సంక్రాంతి పండుగలోగా అన్నిపనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. దీంతో దాదాపు పదేళ్ల నుంచి ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజల రవాణా కష్టాలు తరనున్నాయి. వంతెన నిర్మాణం పూర్తయిలే నర్సీపట్నం- అడ్డురోడ్డు- రేవుపోలవరం మధ్య ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించే అవకాశం వుంది.

Updated Date - Jan 04 , 2025 | 12:58 AM