Share News

సీఎం చంద్రబాబు ప్రకటనపై జేఏసీ ధన్యవాదాలు

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:14 PM

ఆదివాసీ చట్టాలను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనపై ఆదివాసీ జేఏసీ ధన్యవాదాలు తెలుపుతున్నదని జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావు దొర తెలిపారు.

సీఎం చంద్రబాబు ప్రకటనపై జేఏసీ ధన్యవాదాలు
సమావేశంలో పాల్గొన్న ఆదివాసీ జేఏసీ నాయకులు

పాడేరురూరల్‌, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ చట్టాలను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనపై ఆదివాసీ జేఏసీ ధన్యవాదాలు తెలుపుతున్నదని జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావు దొర తెలిపారు. గురువారం స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టంపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో అభద్రతకు లోనైన ఆదివాసీలలో మనోధైర్యం నింపేందుకు జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 12న మన్యం బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడంపై జేఏసీ ధన్యవాదాలు తెలుపుతున్నదన్నారు. జేఏసీ బంద్‌ పిలుపునకు స్పందించి రాజకీయ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యమంలోకి కలిసిరావడం, వాణిజ్య, వ్యాపార వర్గాలు, రవాణా సంబంధిత వర్గాలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడంపై వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడితో ఆదివాసీలకు క్షమాపణలు చెప్పించాలని, స్పీకర్‌ పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందే జీవో నంబరు- 3 విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని, టీఏసీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు శతక బుల్లిబాబు, సుర్ల అప్పారావు, బూడిద మాధవరావు, కె.కిశోర్‌, ఎం.బాబూజీ, శేఖర్‌, గౌరీశంకర్‌, సత్యనారాయణ, నవీన్‌కుమార్‌, శివ, బొంజుబాబునాయుడు, కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:14 PM