భూముల కోసం ఐటీ కంపెనీల అన్వేషణ
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:11 AM
విశాఖపట్నంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ సంస్థలు సిద్ధమవుతున్నాయి.

నగర శివారుల్లో 500 ఎకరాలు సేకరించే పనిలో జిల్లా అధికారులు
సముద్ర తీరానికి 40 కిలోమీటర్లలోపు 80 ఎకరాలు కోరుతున్న గూగుల్
డేటా సెంటర్ ఏర్పాటుచేయనున్నట్టు ఇప్పటికే సంస్థ ప్రకటన
30 ఎకరాల్లో టీసీఎస్ క్యాంపస్
తాత్కాలికంగా మిలీనియం టవర్స్‌లో కార్యకలాపాలు
ఐదారు నెలల్లో ప్రారంభించే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. అందుకు తగిన భూముల కోసం అన్వేషిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి విశాఖపట్నం రావడానికి ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా అధికారులు నగర శివారుల్లో సుమారు 500 ఎకరాలు గుర్తించే పనిలో ఉన్నారు. అవసరమైతే ఆ భూములకు సమీపంలోని డీపట్టా భూములు, జిరాయితీ భూములు సేకరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
గూగుల్, టీసీఎస్ సంస్థలు తమకు అనువైన భూములు గుర్తించే పనిలో ఉన్నాయి. రెండు నెలల క్రితం ఇరు సంస్థల ప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని కలిసి భూమి కేటాయిస్తే సొంతంగా భవనాలు నిర్మించుకుంటామని సూత్రప్రాయంగా వెల్లడించారు. ఆ రెండు సంస్థలకు అవసరమైన భూములు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. డేటా సెంటర్‌ల ఏర్పాటుకోసం సముద్ర తీరానికి 40 నుంచి 50 కిలోమీటర్లలోపు 80 ఎకరాలు కావాలని జిల్లా యంత్రాంగాన్ని గూగుల్ కోరింది. అయితే ఒకేచోట కాకుండా మూడుచోట్ల భూమి తీసుకుని డేటా కేంద్రాలు ఏర్పాటుచేయనున్నది. ఈ సంస్థ కోసం రెండు, మూడుచోట్ల ప్రభుత్వ భూములు, కొండవాలు ప్రాంతాలను అధికారులు గుర్తించారు.
తమకు 30 ఎకరాలు అవసరమవుతుందని టీసీఎస్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈలోగా రుషికొండలో ఖాళీగా ఉన్న మిలినీయం టవర్లలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు టీసీఎస్ సన్నాహాలు చేసుకుంటోంది. రానున్న ఐదారు నెలల్లో టీసీఎస్ తొలిదశ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఐదేళ్లలో పది వేల మంది ఉద్యోగులతో టీసీఎస్ విశాఖ క్యాంపస్‌ను విస్తరించనున్నది. గూగుల్ సంస్థ సంస్థ కూడా ఈ ఏడాది చివరికల్లా సొంతంగా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐటీ సంస్థలకు ప్రభుత్వం ఉచితంగా భూములు కేటాయించదని, నిర్ణీత ధరలకు విక్రయిస్తుందని, అయితే ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన మాత్రం ఏపీఐఐసీ లేదా పరిశ్రమల శాఖ చూస్తాయని ఒక అధికారి తెలిపారు. టీసీఎస్, గూగుల్ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించిన వెంటనే పలు చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలు వస్తాయని, నగరంలో అన్ని రంగాల్లోనూ యాక్టివిటీ పెరుగుతుందన్నారు.