Share News

ఐటీ కంపెనీలను జగనే తెచ్చార ట!

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:37 AM

మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు.

ఐటీ కంపెనీలను జగనే తెచ్చార ట!

  • టీసీఎస్‌, గూగుల్‌ ఆయన ఘనతేనట

  • మాజీ మంత్రి అమర్‌ అడ్డగోలు వాదన

  • భోగాపురం విమానాశ్రయం కూడా వారి చలవేనట

  • రుషికొండ ప్యాలెస్‌ ప్రధాని, రాష్ట్రపతిలకు ఇవ్వాలట

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు. ఆయన ఐటీ మంత్రిగా పనిచేసిన హయాంలో ఒక్కటంటే ఒక్క పెద్ద ఐటీ కంపెనీని కూడా తీసుకురాలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీసీఎస్‌, గూగుల్‌ వంటి సంస్థలు విశాఖపట్నం వస్తుంటే...అవి తమ ఘనతేనని చెప్పుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఇన్ఫోసిస్‌ మాత్రమే వచ్చింది. అది కూడా ఆ పార్టీ నాయకుల ప్రోత్సాహం వల్ల కానే కాదు. వారికి విశాఖలో ఒక కార్యాలయం ఏర్పాటుచేయాలనే ఆలోచన కలిగి సొంతంగా రాజకీయ ప్రమేయం లేకుండానే పెట్టుకున్నారు. దానిని తామే తీసుకువచ్చినట్టు వైసీపీ ప్రచారం చేసుకుంది. ఇకపోతే రాష్ట్రంలో ఐటీకి సరైన ప్రోత్సాహాకాలు లేవని వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సిరిపురంలోని హెచ్‌ఎస్‌బీసీ బిచాణా ఎత్తేసింది. సిటీ సెంట్రల్‌ పార్కు ఎదురుగా నడిచే డబ్ల్యుఎన్‌ఎస్‌ సంస్థ తన కార్యాలయాన్ని హెచ్‌ఎస్‌బీసీ భవనంలోకి మార్చుకుంది. దానిని వక్రీకరించి డబ్ల్యుఎన్‌ఎస్‌ అనేది కొత్త సంస్థ అన్నట్టు, దానిని వైసీపీయే తెచ్చినట్టు అమర్‌ సోమవారం చెప్పుకొచ్చారు. అలాగే భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి 2019లోనే సీఎంగా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఆ విమానాశ్రయాన్ని కూడా జగన్‌న్మోహన్‌రెడ్డి తీసుకువచ్చినట్టు అమర్‌ చెప్పుకున్నారు.

అదేవిధంగా రుషికొండపై ప్యాలెస్‌ను జగన్‌ రూ.500 కోట్లతో సొంతం కోసం నిర్మించుకోలేదని అమర్‌ అడ్డగోలుగా మాట్లాడారు. నాటి సీఎం జగన్‌ తన నివాసం కోసం సముద్ర తీరాన ఆ ప్యాలెస్‌ నిర్మించారని అందరికీ తెలుసు. ఇప్పుడు దానిని ప్రధాని, రాష్ట్రపతి విడిది కోసం ఉపయోగించుకోవాలని అమర్‌ ఓ సలహా కూడా పారేశారు. ప్రధాని, రాష్ట్రపతి విశాఖపట్నం వస్తే కొన్ని గంటల్లోనే ఇక్కడి కార్యక్రమం చూసుకొని వెళ్లిపోతారు. అంత ఎందుకు బుధవారం ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు దిగి తిరిగి రాత్రి 7 గంటలకు బయల్దేరి వెళ్లిపోతున్నారు. ఇలా మూడు, నాలుగు గంటలు ఉంటే వీవీఐపీల విడిది కోసం రూ.500 కోట్ల భవనం ఏడాది పొడవునా ఖాళీగా ఉంచాలా?...ఇదేనా ప్రజాధనం పట్ల బాధ్యత..? అని అమర్‌నాథ్‌ మాటలపై విశాఖ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 01:37 AM