Share News

పర్యాటకాభివృద్ధి ప్రకటనలకే పరిమితమా!

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:00 AM

విశాఖపట్నాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని, కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకువస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదు.

పర్యాటకాభివృద్ధి ప్రకటనలకే పరిమితమా!

  • ఆర్‌డీ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీ

  • రుషికొండ భవనాన్ని నిర్మించిన అధికారికి ఇన్‌చార్జి బాధ్యతలు

  • తప్పించండి మొర్రో అంటూ కూటమి నేతలు మొత్తుకుంటున్నా పట్టించుకోని పెద్దలు

  • ఇప్పుడు వైసీపీ నాయకుడి బంధువును రీజనల్‌ డైరెక్టర్‌కు తీసుకొచ్చేందుకు యత్నం

  • ప్రస్తుతం పర్యాటకులు బస చేసేందుకు ఏపీటీడీసీ పరిధిలో ఒక గది లేదు

  • ఆధునికీకరణ పేరుతో అప్పుఘర్‌ వద్ద ఉన్న యాత్రీనివాస్‌ మూత

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని, కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకువస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన కుదరడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే చక్రం తిప్పారో అదే అధికారికే మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించి కీలక పోస్టులో కూర్చోబెట్టారు. ఆయన రుషికొండపై ఉండే రిసార్ట్స్‌లో ఫర్నీచర్‌ను తుక్కు పేరుతో అమ్మేసి, భారీగా దిగమింగారని ఆధారాలతో సహా చూపించినా చర్యలు తీసుకోలేదని కూటమి నేతలు బహిరంగంగానే వాపోతున్నారు. రుషికొండపై రూ.500 కోట్లతో జగన్మోహన్‌రెడ్డి నిర్మించుకున్న రాజ భవనాన్ని ఇంజనీరింగ్‌ అధికారి (ఈఈ) హోదాలో పర్యవేక్షించి, వాటి వివరాలు బయటకు పొక్కకుండా, అప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతలైన తెలుగుదేశం, జనసేన నాయకుల్ని రుషికొండ రాకుండా అడ్డం పడింది కూడా ఆయనే అని చెబుతున్నా పర్యాటక శాఖ పెద్దల తలకు ఎక్కడం లేదు.

విశాఖలో ఏపీటీడీసీకి ఒక్క గది లేదు

విశాఖపట్నానికి పర్యాటకులు వస్తే బస చేసేందుకు ఏపీటీడీసీ తరపున ఒక్క గది కూడా అందుబాటులో లేకుండా పోవడానికి కారణం కూడా ఆ పెద్ద మనిషే కావడం గమనార్హం. అప్పుఘర్‌ సమీపాన యాత్రీ నివాస్‌ ఉండగా దానిని ఆధునికీకరిస్తామని మూడేళ్ల క్రితం రూ.8.5 కోట్లతో ఆ అధికారి ఆధ్వర్యంలోనే పనులు చేపట్టారు. భవనానికి ప్లాస్టరింగ్‌ చేసి, రంగులేసి, ఫర్నీచర్‌ మార్చడానికి ఈ నిధులు ఉపయోగించుకుంటామని అప్పట్లో చెప్పారు. కొంతకాలం గడిచాక ఆ నిధులు సరిపోకపోవడం లేదని మధ్యలో పనులు ఆపేశారు. పూర్తి చేయాలంటే అదనంగా మరో రూ.3.5 కోట్లు అవసరం అని లెక్క తేల్చారు. వాస్తవానికి రూ.12 కోట్లు పెడితే ఆ స్థలంలో కొత్త భవనాన్నే నిర్మించవచ్చుననేది కూటమి నేతల వాదన. ఆ అధికారి హయాంలో అన్నీ తప్పులే కనిపిస్తున్నా కనీస చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ను బదిలీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించారు. పర్యాటక శాఖలో రీజనల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి ఆ శాఖలో అంతర్గత రాజకీయాలు, ఫిర్యాదులు తట్టుకోలేక నాలుగు నెలల క్రితం మాతృశాఖకు వెళ్లిపోయారు. దాంతో ఆ బాధ్యతలు కూడా ఈ ఇంజనీరింగ్‌ అధికారికే అప్పగించారు. దాంతో కూటమి నేతలకు తల కొట్టేసినంత పని అయింది. ‘ఆయన మాకు వద్దు’ అని స్పష్టంగా చెప్పి, ప్రత్యామ్నాయంగా కొందరు అధికారుల పేర్లు సూచిస్తే అది కూడా పరిశీలించలేదు. పక్కన పెట్టేశారు. తమకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పినట్టు సమాచారం. అయితే చోడవరానికి చెందిన వైసీపీ నాయకుడి దూరపు బంధువు అయిన ఒక అధికారిని తీసుకువచ్చి ఆర్‌డీగా నియమిస్తారని తెలిసి మళ్లీ కూటమి నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. వైసీపీకి ఊడిగం చేసిన అధికారులనే తీసుకువచ్చి కీలక స్థానాల్లో ఎలా నియమిస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది.

ఇక ఇటీవల ఇక్కడ ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించారు. ఈ అధికారుల తీరు తెలిసి ఈ ప్రాంతానికి చెందినవారు ఎవరూ విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదని, వచ్చిన వాటిలో అధికం రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందినవేనని, ఈ విషయం కూడా పర్యాటక శాఖ పెద్దలు గుర్తించడం లేదని విశాఖ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ పర్యాటక శాఖలో అధికారుల మధ్య సమన్వయం లేదు. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ అధికారులు తెచ్చే ప్రతిపాదనలు పూర్తిగా పరిశీలించకుండా ఓకే అంటే...ఏమి చిక్కులు వచ్చి పడతాయోనని జిల్లా ఉన్నతాధికారులు ఒకటికి, రెండుసార్లు ఆలోచించి వెనక్కి పంపేస్తున్నారు. దాంతో ఇక్కడ ఏదీ ముందుకు కదలడం లేదు. విశాఖలో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఆ లెక్కలు కూడా బయటకు రానీయడం లేదు.

Updated Date - Feb 15 , 2025 | 01:00 AM