సంపూర్ణంగా వరి సన్నరకాల సాగు సాధ్యమేనా?
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:46 AM
వరి పంటలో ముతక రకాల స్థానంలో సన్నరకాలను సాగులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో గల సాధకబాధకాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అధ్య యనం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో 40 శాతం ముతక రకాలనే సాగు చేస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో సన్నరకాల వ్యాప్తికి ఎంత కాలం పడుతుందనే దానిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అంచనాలు వేస్తున్నారు.

- ముతక రకాల బియ్యానికి లభించని ధర, డిమాండ్
- రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయ్యే ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు
- పాలిష్ చేసి సన్నరకాలుగా ఎగుమతి
- ఈ క్రమంలో సన్నరకాలనే ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం
- ఉత్తరాంధ్రలో 40 శాతం ముతక రకాలు సాగు
- దీని స్థానంలో సన్నరకాలను వ్యాప్తి చేయాలని యోచన
- సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు
అనకాపల్లి అగ్రికల్చర్, మార్చి8(ఆంధ్రజ్యోతి):
వరి పంటలో ముతక రకాల స్థానంలో సన్నరకాలను సాగులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో గల సాధకబాధకాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అధ్య యనం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో 40 శాతం ముతక రకాలనే సాగు చేస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో సన్నరకాల వ్యాప్తికి ఎంత కాలం పడుతుందనే దానిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అంచనాలు వేస్తున్నారు.
వాస్తవానికి ముతక రకం బియ్యానికి తగిన డిమాండ్, ధర లభించడం లేదు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయ్యే ఈ బియ్యాన్నే మిల్లర్లు అక్రమంగా కొనుగోలు చేసి పాలిష్ చేస్తున్నారు. ఇలా పాలిష్ చేసిన బియ్యాన్ని సన్నబియ్యం పేరుతో ఎగుమతి చేసే మాఫియా కూడా తయారైంది. దీంతో ప్రభుత్వం మేల్కొని ముతక రకాలకు బదులు సన్నరకాలనే ప్రోత్సహించాలని నిర్ణయించింది. ముతక రకాల ఽధాన్యం సేకరణను నిలిపివేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇటీవల వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముతక రకాలకు దీటైన సన్నరకాల వంగడాలను రూపొందించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కోరింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సన్న వరి రకాలు సాగు చేసే రైతులకు సబ్సిడీ ఇస్తామని గత ఏడాది ప్రకటించింది. కాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సన్న, ముతక రకాల సాగు ఎలా ఉంది?, మొత్తం విస్తీర్ణంలో 40 శాతం ఉన్న ముతక వరి రకాలకు బదులు సన్నరకాల వ్యాప్తికి ఎంత కాలం పడుతుందనే అంశాలపై శాస్త్రవేత్తలు, అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. ఉత్తరాంరఽధలో 10 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. రబీలో ఇది 10 వేల ఎకరాలకు మించడం లేదు. రబీలో పండే వరి అంతా ముతక రకాలకు చెందిందే కావడం విశేషం. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న శ్రీధృతి(ఎంటీయూ1121) ముతక రకం వరికి బదులు సన్నరకాలను వ్యాప్తిలోకి తేవడం అంత సులభం కాదు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే..
శ్రీకాకుళం జిల్లాలో స్వర్ణ, సాంబ సన్న రకాలు 40 శాతం విస్తీర్ణంలో సాగవుతున్నాయి. 1318, 1262 అనే సన్నరకాల విస్తీర్ణం ఇటీవల పెరుగుతోంది. ముతక రకం ఎంటీయూ 1121 రకం కూడా అధికంగానే సాగవుతోంది. శ్రీకాకుళం సన్నాలు రకం ఇక్కడ 5 శాతం కన్నా ఎక్కువ సాగవుతోంది. ఇవికాక వసుంధర, శ్రీకూర్మ, 1061, 1064 రకాలు మిగతా విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ముతక రకం ఎంటీయూ 1121 అధిక విస్తీర్ణం(40 నుంచి 50 శాతం)లో సాగవుతోంది. సన్నరకాలైన స్వర్ణ, సాంబ 20 నుంచి 30 శాతం విస్తీర్ణంలో పండిస్తున్నారు. దిగుబడి బాగుంటున్నందున, ఆరుతడి పరిస్థితికి అనువుగా ఉన్నందున సోనా మసూరి బాగా వ్యాప్తి చెందుతోంది. ధాన్య సేకరణ నుంచి ముతక రకాలను మినహాయిస్తే సమస్యలెదురవుతాయి. విశాఖ జిల్లాలో శ్రీకాకుళం సన్నాలు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంది. ఎంటీయూ 1121, ఆర్‌ఎన్‌ఆర్ 15048 ముతక రకాల విస్తీర్ణం ఈ జిల్లాలో పెరుగుతోంది. అనకాపల్లి జిల్లాలో అయితే శ్రీకాకుళం సన్నాలు అధికంగా సాగులో ఉంది. ముంపు, ఆలస్యపు నాట్లు, తుఫాన్‌లను తట్టుకొనే ఈ రకంపైనే రైతులు మొగ్గు చూపుతునారు. ఎంటీయూ 1064 రకం 15 శాతం విస్తీర్ణంలో 1318, 1262 రకాలు 5శాతం విస్తీర్ణంలో ఉన్నాయి. ఉత్తర కోస్తా మొత్తం మీద ఆర్‌టీయూ 1156, ఎంటీయూ 1210, సంపత్ సోనా వంటి ప్రైవేట్ హైబ్రీడ్ రకాలు 10 శాతానికి పైగా విస్తీర్ణంలో ఉన్నాయి. రుచి బాగుంటుందని ఎంటీయూ 1224, 1262, 1318 రకాలను పండిస్తున్నారు.
రాగోలు నుంచి కొత్త రకాలు
రాగోలు పరిశోధనా స్థానం ఆర్‌జీఎల్ 7016 అనే సన్నరకం వరి వంగడాన్ని ఈ ఏడాది విడుదల చేయనున్నది. మరో రెండు రకాలు పరిశోధనలో ఉన్నాయి. పంట కాల పరిమితి, వాతావరణం, సాగునీటి పరిస్థితి, దిగుబడి, చీడపీడలను తట్టుకునే స్థితి రకాల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.