ఫుడ్ లేబొరేటరీ సేవలందేనా?
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:27 AM
ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన స్టేట్ ఫుడ్ లేబొరేటరీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.

గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ప్రధాని మోదీ
ఇప్పటికీ అందుబాటులోకి రాని సేవలు
నిరుపయోగంగా పడి ఉన్న రూ.15 కోట్ల పరికరాలు
బీజేపీ నేతలు నిరసన తెలిపినా పట్టించుకోని ఉన్నతాధికారులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):
ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన స్టేట్ ఫుడ్ లేబొరేటరీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర విభజన తరువాత స్టేట్ ఫుడ్ ల్యాబ్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. దీనిని నగరంలోని పెదవాల్తేరు ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. లేబ్ ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. రెండేళ్ల కిందట భవన నిర్మాణం పూర్తయింది. గత ఏడాది ఫిబ్రవరి 25న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు కేటాయించిన లేబ్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయన ప్రారంభించడానికి కొన్ని రోజులు ముందే సుమారు రూ.10 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను ఇక్కడ ఏర్పాటుచేశారు. సాధారణంగా ప్రారంభోత్సవం జరిగిన తరువాత సేవలు అందుబాటులోకి రావాలి. కానీ ఇప్పటికీ ప్రారంభించకపోవడం గమనార్హం.
బీజేపీ ఆందోళనలు చేసినా...
ఫుట్ లేబొరేటరీ అందుబాటులోకి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య పరిరక్షణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ నాయకులు నిరసన తెలియజేశారు. తక్షణమే ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేబ్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం, అత్యాధునిక పరికరాలు, కెమికల్స్ నిరుపయోగంగా మారాయి. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికీ హైదరాబాద్‌లోనే..
విభజనకు ముందు స్టేట్ ఫుడ్ లేబ్ హైదరాబాద్‌లో ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆహార, భద్రతా ప్రమాణాలశాఖ అధికారులు తనిఖీల సందర్భంగా సేకరించిన నమూనాలను ఈ లేబ్‌కు పంపుతున్నారు. వాటిని అక్కడి సిబ్బంది అనాలసిస్ చేసి రిపోర్టులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారు. అయితే విశాఖలో లేబ్ అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పటికీ అధికారులు హైదరాబాద్‌కు నమూనాలు పంపిస్తున్నారు. అక్కడి నుంచి ఫలితాలు రావడానికి కనీసం పది నుంచి నెల రోజుల సమయం పడుతోంది. దీంతో నిందితులపై సకాలంలో చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఈశాఖ పనితీరుపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
ఇన్‌స్టాల్ చేయని పరికరాలు
లేబ్‌లో ఆయిల్స్, ఆహారం, పప్పులు, పాలు, పాల ఆధారిత పదార్థాలు, చాక్లెట్స్, బిస్కెట్స్, సాఫ్ట్ డ్రింక్ వంటి 17 సెక్షన్స్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన 30 రకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ వీటిని పూర్తిస్థాయిలో ఇన్‌స్టాల్ చేయలేదు. ఇక్కడ పనిచేసేందుకు వివిధ కేడర్లకు చెందిన సుమారు 80 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇప్పటివరకు ప్రారంభించలేదు. దీంతో స్టేట్ ఫుడ్ లేబ్ సేవల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.