ఇసుక రవాణాలో అక్రమాలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:37 AM
ఇసుక వినియోగంలో ప్రభుత్వం పూర్తి వెసులుబాటు కల్పించినా కొందరు లారీ డ్రైవర్లు నకిలీ వే బిల్లులతో నగరానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు.

నకిలీ బిల్లులతో నగరానికి చేరుతున్న వైనం
శ్రీకాకుళం రీచ్‌ల సిబ్బందితో లారీ డ్రైవర్ల మిలాఖత్
రెండు నెలల్లో పదుల సంఖ్యలో లారీలను పట్టుకున్న గనులశాఖ
అధికారుల పర్యవేక్షణా లోపమే కారణం
విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):
ఇసుక వినియోగంలో ప్రభుత్వం పూర్తి వెసులుబాటు కల్పించినా కొందరు లారీ డ్రైవర్లు నకిలీ వే బిల్లులతో నగరానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. బిల్లులపై ఉన్న సమయంతో సంబంధం లేకుండా నదిలో రీచ్‌ల వద్ద పనిచేసే కొందరు సిబ్బంది, లారీ డ్రైవర్లు మిలాఖత్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గత రెండుమూడు నెలలుగా నకిలీ వేబిల్లులతో వందల లారీల ఇసుక నగరానికి చేరింది.
శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదుల్లో కొన్నిచోట్ల రీచ్‌లు గుర్తించి ప్రైవేటు వ్యక్తులకు నిర్వహణ బాధ్యత అప్పగించారు. నామమాత్రపు రుసుం, నిర్వహణ, లోడింగ్‌వ్యయం పేరిట టన్నుకు రూ.200 వరకు మాత్రమే వసూలు చేస్తున్నారు. దీనికి వే బిల్లులు జనరేట్‌చేసి లారీ డ్రైవర్లకు అందజేస్తారు. బిల్లుపై లారీ పేరు, నంబరు ,లారీ బయలుదేరే సమయం నుంచి ఎక్కడికి రవాణా చేస్తారు? అన్న వివరాలు నమోదుచేస్తారు. ఒక రీచ్‌లో రోజువారీ తవ్వకాలు, లోడింగ్ వివరాలు, వాహనాల నంబర్లు గనులశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఒక రీచ్‌లో ఎంత ఇసుక తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది?అ న్నది కూడా వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఉదాహరణకు ఒక రీచ్‌లో రెండు లక్షల టన్నుల ఇసుక తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇస్తే... గనులశాఖ వెబ్‌సైట్‌లో రెండు లక్షల టన్నుల వరకు మాత్రమే వేబిల్లులు జనరేట్ అవుతాయి. అంతకుమించి తవ్వినా దానికి సంబంధించి బిల్లులు జనరేటయ్యే అవకాశంలేదు. ప్రతి రీచ్‌లో ఎంత మేర తవ్వకానికి అనుమతి ఉంది? ఎంత మేర తవ్వి రవాణా చేస్తున్నారు... సమయం గనులశాఖ అధికారులు తెలుసుకునే వెసులబాటు కల్పించారు. అయితే రీచ్‌ల వద్ద కొందరు సిబ్బంది, లారీ డ్రైవర్లు కుమ్మక్కై ప్రభుత్వం ఇచ్చిన అనుమతికి మించి ఇసుక తవ్వేసి రవాణా చేస్తుంటారు. దీనికి మాత్రం వే బిల్లుల ప్రాసెస్ జరగదు. కానీ తప్పుడు మార్గంలో వెళ్లి నకిలీ వే బిల్లులు తయారుచేసి విశాఖకు ఇసుక తరలిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు తనిఖీల సమయంలో నకిలీ వేబిల్లులు గుర్తుపట్టలేకపోవడంతో డ్రైవర్లు వందల లారీల నకిలీ వేబిల్లులతో ఇసుక తోలేశారు. కేవలం గనులు శాఖ, విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తే మాత్రమే నకిలీ వే బిల్లులు గుర్తించి పట్టుకుంటున్నారు. ఇలా రెండు నెలల్లో పదుల సంఖ్యలో నకిలీ వేబిల్లులతో లారీలు పట్టుకుని జరిమానా విధించారు.
దాడులపై ముందస్తు సమాచారం
గనులశాఖ అధికారులు దాడులు చేస్తారన్న విషయం ముందుగానే తెలుసుకుంటున్న లారీ డ్రైవర్లు అప్రమత్తమై రీచ్‌ల వద్దే ఉండిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు దారి పొడవునా ప్రతిరోజూ గనులశాఖ, విజిలెన్స్ అధికారులు లారీలు తనిఖీ చేయడం సాధ్యం కాదు. అందువల్ల దాడులు చేయని రోజుల్లో ఎక్కువగా నకిలీ బిల్లులతో ఇసుక నగరానికి తరలిస్తున్నారు. నదులకు ఆనుకుని కొన్ని గ్రామాలకు చెందిన వ్యక్తులు ఇసుక తవ్వి పొలాలు, కళ్లాల్లో నిల్వచేస్తున్న ఇసుకను కొందరు కొనుగోలుచేసి నకిలీ వేబిల్లులతో విశాఖకు తీసుకువస్తున్నారు. నగరంలో రిటైల్ వ్యాపారులు, బిల్డర్లకు ఇసుక సరఫరాచేసే కొందరు తమకు తెలిసిన లారీ డ్రైవర్ల ద్వారా నకిలీ వేబిల్లుల బాగోతం నడుపుతున్నారు. ఇసుక తరలింపునకు నామమాత్రపు రుసుం మాత్రమే వసూలు చేసే వీలుంది. అది కూడా రీచ్‌ల నిర్వహణకు మాత్రమే తీసుకుంటున్నారు. అయినా కొందరు సిబ్బంది రీచ్ నిర్వాహకులకు టోపీ పెట్టి లారీ డ్రైవర్లతో మిలాఖత్ అయి ఇసుక తరలిస్తున్నారు. ఇటువంటి అక్రమాలకు తెరదించాలంటే అన్ని శాఖలతో బృందాలను ఏర్పాటుచేసి నిరంతరం నిఘా ఉంచాలని గనులశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.