Share News

నగరంలో ఐపీఎల్‌ సందడి

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:47 AM

టాటా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రెండు మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యమివ్వనుంది.

నగరంలో ఐపీఎల్‌ సందడి

  • రెండు మ్యాచ్‌లకు వేదికగా ఏసీఏ వీడీసీఏ స్టేడియం

  • మార్చి 24న తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్‌

  • మార్చి 30న ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

  • విడుదలైన షెడ్యూల్‌

విశాఖపట్నం, స్పోర్ట్సు, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):

టాటా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రెండు మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యమివ్వనుంది. ఐపీఎల్‌ సీజన్‌-18 షెడ్యూల్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేసిన సందర్భంగా విశాఖకు రెండు మ్యాచ్‌లు కేటాయించారు. పీఎం పాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌-లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. అదేవిధంగా మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్‌-సన్‌రైజర్‌ హైదరాబాద్‌ జట్టు ఇదే గ్రౌండ్‌లో తలపడనున్నాయి.

గత ఏడాది పీఎంపాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడింది. ఈ ఏడాది కూడా ఇదే స్టేడియాన్ని హోం గ్రౌండ్‌గా చేసుకోవడంతో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం లభించింది. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో, రెండో మ్యాచ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌లను విశాఖకు కేటాయించే అవకాశముందని భావించి ఏసీఏ ప్రతినిధులు నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను పంపించారు. తాజాగా రెండు మ్యాచ్‌లను కేటాయించడంతో పక్కాగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్ర క్రికెట్‌ సంఘానికి ఇటీవల కొత్త కార్యవర్గం ఏర్పడడంతో మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. కాగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఇక్కడ నిర్వహించేలా కృషిచేసిన ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేశినేని చిన్ని, ఉపాధ్యక్షుడు పి.ప్రశాంత్‌, ప్రధాన కార్యదర్శి సానా సతీష్‌లకు ఔత్సాహిక క్రికెటర్లు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. పకడ్బందీగా మ్యాచ్‌లను నిర్వహించాలని కోరారు.

Updated Date - Feb 17 , 2025 | 12:47 AM