ఆక్రమణల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:11 AM
ఆక్రమణల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు.

150 గజాల వరకూ ఉచితం: కలెక్టర్
విశాఖపట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):
ఆక్రమణల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు 150 గజాల వరకూ ఆక్రమణలకు ఉచితంగా కన్వేయన్స్ డీడ్ జారీ చేస్తామన్నారు. 151 గజాల నుంచి 300 గజాల వరకూ బేసిక్ విలువపై 15 శాతం, 301 నుంచి 450 గజాల వరకు దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలు బేసిక్ విలువపై 100 శాతం, పైనున్న కుటుంబాలు 200 శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంకా 451 గజాలు, ఆపై ఉన్న ఆక్రమణల క్రమబద్ధీకరణకు అన్ని వర్గాలు బేసిక్ విలువకు ఐదు రెట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసిన రెండు నెలల్లో చలానా రూపంలో రుసుం చెల్లించాలన్నారు. దరఖాస్తులు గ్రామ, వార్డు సచివాలయాలు, తహసీల్దారు కార్యాలయాల్లో అందజేయాలన్నారు. ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. దరఖాస్తుతోపాటు రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రశీదు, కరెంటు బిల్లు, నీటి పన్ను రశీదు, ఆక్రమణలకు సంబంధించి ఇతర పత్రాలు జతచేయాలని సూచించారు. దరఖాస్తులను మండల, డివిజన్ స్థాయిల్లో కమిటీలు పరిశీలించి ఆమోదిస్తాయని పేర్కొన్నారు.
వీఎంఆర్‌డీఏ ప్లాట్లు, ఫ్లాట్లు వేలం
విశాఖపట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) గతంలో వేసిన లేఅవుట్లు, హౌసింగ్ ప్రాజెక్టులలో మిగిలిపోయిన వాటిలో కొన్ని ప్లాట్లు, ఫ్లాట్లను మళ్లీ ఈ-వేలానికి పెట్టింది. మారికవలస హరిత హౌసింగ్ ప్రాజెక్టులో నాలుగు ఫ్లాట్లు, కూర్మన్నపాలెం హౌసింగ్ లేఅవుట్‌లో 4 ఫ్లాట్లు, కాపులుప్పాడ హౌసింగ్ లేఅవుట్‌లో మరో నాలుగు ఫ్లాట్లను అమ్మకానికి ఉంచింది. ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇదే నెల 27న ఈ-వేలం నిర్వహిస్తుంది. ఇక ప్లాట్ల విషయానికి వస్తే దాకమర్రి లేఅవుట్‌లో 30 ప్లాట్లు, పాలవలస ఎంఐజీ లేఅవుట్‌లో 30 ప్లాట్లు, మధురవాడ ఓజోన్‌వేలీ, సైబర్ వేలీ లేఅవుట్లలో 32 ప్లాట్లు, పరవాడ మండలం చీపురుపల్లి జాయింట్ వెంచర్ లేఅవుట్‌లో 30 ప్లాట్లు, కూర్మన్నపాలెం ఫేజ్-1, పెదగంట్యాడ ఫేజ్-1 లేఅవుట్లలో 22 ప్లాట్లు అమ్మకానికి ఉంచింది. వీటికి ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు లేఅవుట్ల వారీగా ఈ-వేలం నిర్వహిస్తుంది. ఇతర వివరాలకు ఏపీ ప్రభుత్వానికి చెందిన కొనుగోళ్లు పోర్టల్ పరిశీలించాలని వీఎంఆర్‌డీఏ పేర్కొంది.
ఉక్కులో మరో 340 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపు!
నేడు పాతగాజువాకలో ధర్నా
ఉక్కుటౌన్‌షిప్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు కొనసాగుతోంది. శుక్రవారం 250 మంది కార్మికులను ఆపేసిన యాజమాన్యం, శనివారం మరో 340 మంది బయోమెట్రిక్‌ను నిలిపివేసినట్టు తెలిసింది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాతగాజువాకలో భారీఎత్తున ధర్నా చేపట్టనున్నట్టు ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు ప్రకటించారు. భారీఎత్తున కార్మికులు, ఉద్యోగులు పాల్గొనాలని కోరారు.