ముదపాక ల్యాండ్ పూలింగ్‌పై విచారణ
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:05 AM
పెందుర్తి మండలం ముదపాకలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌పై తలెత్తిన వివాదంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది.

ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లతో కమిటీ
మూడు నెలల క్రితం విజిలెన్స్ విచారణ
ఇప్పుడు పునర్విచారణ
లబ్ధిదారులుగా వైసీపీ నేతల పేర్లు చేర్చినట్టు అప్పట్లో ఆరోపణలు
కోర్టులో కేసు నడుస్తుండగానే దళితుల భూములను ఇళ్ల నిర్మాణానికి కేటాయించడంపైనా వివాదం
విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):
పెందుర్తి మండలం ముదపాకలో చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌పై తలెత్తిన వివాదంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని నియమించింది. జాతీయ రహదారుల భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ సీతారామరావు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ మాధవి, భీమిలి ఆర్డీవో సంగీత్‌మాధుర్ కమిటీ సభ్యులుగా ఉంటారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాం (2015-16)లో అప్పటి అధికారులు ముదపాకలో ల్యాండ్ పూలింగ్‌కు నిర్ణయించారు. అయితే టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం నెలకొనడంతో అధికారులు వెనక్కి తగ్గారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వీఎంఆర్‌డీఎ నేతృత్వంలో ముదపాకలో సుమారు 800 ఎకరాలను సమీకరించాలని నిర్ణయించారు. భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్నారు. డీపట్టా భూములకు ఎకరాకు 900 గజాలు, రైతులు ఆక్రమించుకుని సాగు చేట్టు రికార్డుల్లో నమోదైతే 450 గజాలు, రికార్డుల్లో లేకపోయినా రైతుల ఆధీనంలో ఉంటే 250 గజాల ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. డీపట్టా భూముల వరకూ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. రైతుల ఆక్రమణలో ఉన్న భూముల విషయంలో నాడు వైసీపీ నాయకులు చెప్పినట్టు పెందుర్తి రెవెన్యూ అధికారులు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లతో సాగులో లేని వైసీపీ సానుభూతిపరుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. ఇంకా సాగులో ఉన్న ఆక్రమణదారులకు సంబంధించి విస్తీర్ణం తక్కువ చూపించారు. దీనిపై ఫిర్యాదులు వచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీనికితోడు ఆ భూములను ముందుగానే రైతుల నుంచి కొందరు రియల్టర్లు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ల్యాండ్ పూలింగ్‌కు తమ భూములు ఇచ్చేది లేదని కొందరు దళితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే భూమిని జగనన్న కాలనీలకు కేటాయించారు. కోర్టులో కేసు నడుస్తున్న భూమిని కూడా ఇళ్ల స్థలాలకు కేటాయించడంతో మరో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముదపాక భూముల వ్యవహారంపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు మూడు నెలల క్రితమే విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక పంపారు. తాజాగా జిల్లా యంత్రాంగం ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లతో కమిటీని నియమించి విచారణకు ఆదేశించింది. ముదపాకలో గడచిన ఎనిమిదేళ్ల నుంచి జరిగిన వ్యవహారాలపై ఈ కమిటీ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నది.