ఎన్టీఆర్ వైద్యాలయంలో సేవలపై ఆరా
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:22 PM
ప్రజలకు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విజయకృష్ణన్
ప్రసూతి వార్డులో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుపై విచారణ
బాలింతలతో మాట్లాడి వివరాల సేకరణ
గైనిక్ వైద్యురాలిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశం
అనకాపల్లి టౌన్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రజలకు వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా గైనిక్ విభాగంపై ఆమె దృష్టి సారించారు. ప్రసూతి వార్డులో చికిత్స నిమిత్తం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా బాలింతల వార్డును పరిశీలించారు. వార్డులో ఉన్న ప్రతి బాలింత వద్దకు వెళ్లి వైద్యం ఎలా జరిగింది?, డబ్బులు ఏమైనా ఇచ్చారా? అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ తాము డబ్బులు ఇవ్వలేదని, వైద్యం కూడా బాగానే చేశారని వారు సమాధానమిచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారని ఒక బాలింతను ప్రశ్నించగా, రాంబిల్లి నుంచి వచ్చామని, ఇక్కడైతే వైద్యం బాగా అందుతుందన్న భావంతో వచ్చామని చెప్పారు. అలాగే రావికమతం మండలానికి చెందిన ఎం.శ్యామల అనే బాలింతను కూడా కలెక్టర్ ప్రశ్నించి పుట్టిన బిడ్డను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గైనిక్ వైద్యులు, ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని విచారణ చేపట్టారు. విచారణ అనంతరం గైనిక్ వార్డులో విధులు నిర్వహిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న గైనిక్ వైద్యురాలిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్ ఎస్.శ్రీనివాసరావును కలెక్టర్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.