Share News

జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలో కుమ్ములాట

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:30 AM

జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి.

జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలో కుమ్ములాట

  • అర్ధంతరంగా కార్యవర్గం రద్దు

  • అవినీతి ఆరోపణలే కారణం?

విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో మరో ఆరునెలలు కాలపరిమితి ఉండగానే సంఘం కార్యవర్గం మూకుమ్మడిగా రాజీనామా చేసింది. కాంట్రాక్టర్ల సంఘంలోని కొందరు పెద్దలు జీవీఎంసీ అకౌంట్స్‌ విభాగంలోని అధికారులతో మిలాఖత్‌ అయి ఇతర కాంట్రాక్టర్లకు అన్యాయం చేశారంటూ కాంట్రాక్టర్లు బహిరంగ ఆరోపణలకు దిగారు.

ఇటీవల ముస్లిం తాటిచెట్లపాలెంలోని షాధీఖానాలో జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా సంఘం పెద్దలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్లకు ఈఎండీలను రాబట్టడం, పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు ప్రాధాన్య క్రమంలో బిల్లులు చెల్లింపు జరిగేలా చూడాల్సిన సంఘంలోని కొందరు పెద్దలు అకౌంట్స్‌ విభాగంలోని అధికారులతో కలిసి తమ బిల్లులను అడ్డదారిలో ముందుగానే తీసుకున్నారని సభ్యులు ఆరోపించారు. ఇతర కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు నాలుగుశాతం కమీషన్‌ ఇప్పించి పెత్తనం చెలాయించారని విమర్శలు గుప్పించారు. యూనియన్‌లో ఒకే సామాజికవర్గానికి పదవులు కట్టబెట్టి, ఇతర సామాజికవర్గాలకు ఐదుశాతం పదవులను మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు తప్పుకోవడంతో కార్యవర్గం రద్దయింది. యూనియన్‌లో గతంలో పెత్తనం చేసిన కొంతమంది కాంట్రాక్టర్లే అస్మదీయులను ఎగదోసి తమను చెడ్డగా చిత్రీకరించేలా చూస్తున్నారంటూ ఇటీవల రద్దైన కార్యవర్గంలోని కొందరు పెద్దలు ప్రత్యారోపణలు చేస్తుండడంతో కాంట్రాక్టర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరిపై ఆరోపణలు చేసేందుకు మరొకరు ప్రెస్‌మీట్‌లు పెట్టేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.

------------------------------------------------------------------------------------

మహా శివరాత్రికి 250 ప్రత్యేక బస్సులు

ద్వారకాబస్‌స్టేషన్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి సందర్భంగా పుణ్యక్షేత్రాలు, దర్శనీయస్థలాలకు, ఆర్టీసీ 300 ప్రత్యేక బస్సులు నడపనుంది. అప్పికొండ సోమేశ్వరాలయానికి గాజువాక నుంచి 60, సింథియా నుంచి 10, స్టీల్‌సిటీ డిపో నుంచి 30, దువ్వాడ నుంచి 10, అగనంపూడి నుంచి 10 బస్సులు నడపనున్నారు. రామకృష్ణ బీచ్‌లో మహా కుంభాభిషేకానికి హాజరయ్యేందుకు వీలుగా పెందుర్తి నుంచి 40, కొత్తవలస నుంచి 30, గాజువాక నుంచి 30, ఉక్కునగరం నుంచి 10 సర్వీసులు నడుపుతారు. గాజువాక నుంచి పంచదార్లకు 10, కల్యాణపులోవకు 10 బస్సులు నడపనున్నట్టు రీజనల్‌ మేనేజర్‌ బిఅప్పలనాయుడు తెలిపారు. సముద్ర స్నానాలకు వీలుగా రామకృష్ణాబీచ్‌, అప్పికొండకు గురువారం బస్సులు నడుపుతామన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:30 AM