పుంజుకున్న రిజిస్ర్టేషన్లు
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:04 AM
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గతం కంటే మెరుగైన పనితీరు ప్రదర్శించింది.

జనవరిలో భారీగా లావాదేవీలు
30, 31 తేదీల్లోనే రూ.35.6 కోట్ల ఆదాయం
గత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో రూ.693.77 కోట్ల ఆదాయం ఈ ఏడాది రూ.716.59 కోట్లు...
3.29 శాతం వృద్ధి
ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గతం కంటే మెరుగైన పనితీరు ప్రదర్శించింది. ప్రభుత్వం భారీగా లక్ష్యం ఇవ్వగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్థిరమైన ఆదాయం సాధించడానికి కాసింత సమయం తీసుకుంటోంది. డిసెంబరు నెలాఖరు వరకూ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే అభివృద్ధి తక్కువగా ఉండగా, జనవరి నెలలో మాత్రం ‘మైనస్’ నుంచి ‘ప్లస్’కు వచ్చింది. వృద్ధిని నమోదుచేసింది.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సవరించిన (పెంచిన) భూముల రేట్లు అమలులోకి వస్తాయని ప్రకటించడంతో జనవరి నెల చివరి వారంలో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మూడు రోజులు వరుసగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను రెట్టింపు డాక్యుమెంట్లు వచ్చాయి. జిల్లాలో జనవరి 30, 31 తేదీల్లో 1,534 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. వీటి ద్వారా రెండు రోజుల్లోనే రూ.35.6 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో అప్పటివరకూ మైనస్‌లో ఉన్న విశాఖ జిల్లా ఆదాయం గత ఏడాది కంటే 3.29 శాతం పెరిగి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి అంటే ఏప్రిల్ నుంచి జనవరి నెలాఖరు వరకు రూ.693.77 కోట్లు ఆదాయం రాగా, ఇప్పుడు జనవరితో ముగిసిన పది నెలలకు రూ.716.59 కోట్లు వచ్చింది. ఈ రెండు నెలల్లో అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో రూ.300 కోట్ల ఆదాయం సాధించి, 2024-25లో వేయి కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తామని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యంగా సింహాచలం దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించిందని, ఆ వివాదానికి సంబంధించి సుమారుగా ఐదు వేల వరకు డాక్యుమెంట్లు దాఖలవుతాయని, దాంతో మంచి ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
రూ.వేయి కోట్లు సాధిస్తాం
ఉపేంద్రరావు, జిల్లా రిజిస్ట్రార్
ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలో రియల్ ఎస్టేట్ లావాదేవీలను బట్టి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1,526 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఇచ్చింది. ఎన్నికల సంవత్సరం కావడం, ప్రభుత్వం మారితే విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ఉండడం వల్ల కొన్ని నెలల పాటు లావాదేవీలు తగ్గిపోయాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక...పరిస్థితులపై అవగాహన పెంచుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో రిజిస్ట్రేషన్లు అధికంగానే ఉంటాయి. ఇప్పటివరకు రూ.716.59 కోట్లు ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు వేయి కోట్ల మార్కు దాటేస్తాం. జిల్లాలోని మొత్తం తొమ్మిది కార్యాలయాల ఆదాయం పరిశీలిస్తే భీమునిపట్నం, ద్వారకానగర్, గోపాలపట్నం కార్యాలయాలు మాత్రమే అంతకు ముందు ఏడాది కంటే తక్కువ ఆదాయంలో ఉన్నాయి. మిగిలిని ఆరు కార్యాలయాలు ఎక్కువ ఆదాయం సాధించాయి. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది జనవరి నెలాఖరుకు ఇప్పటికీ బేరేజు వేసుకుంటే 3.29 శాతం వృద్ధి సాధించాము.
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల వారీగా...
-----------------------------------------------------------------------------------కార్యాలయం ఏడాది లక్ష్యం ఇప్పటివరకూ గత ఏడాది
లభించిన ఆదాయం ఇదేకాలపు ఆదాయం
----------------------------------------------------------------------------------
ఆనందపురం రూ.72.18 కోట్లు రూ.48.84 కోట్లు రూ.45.73 కోట్లు
భీమునిపట్నం రూ.68.36 కోట్లు రూ.40.02 కోట్లు రూ.47.57 కోట్లు
ద్వారకానగర్ రూ.119,63 కోట్లు రూ.69.99 కోట్లు రూ.72.04 కోట్లు
గాజువాక రూ.119.6 కోట్లు రూ.76.58 కోట్లు రూ.73.95 కోట్లు
గోపాలపట్నం రూ.89.41 కోట్లు రూ.44.82 కోట్లు రూ.46.57 కోట్లు
మధురవాడ రూ.266.91 కోట్లు రూ.177.31 కోట్లు రూ.158.83 కోట్లు
పెందుర్తి రూ.92.88 కోట్లు రూ.51.97 కోట్లు రూ.51.76 కోట్లు
సూపర్‌బజారు రూ.276.3 కోట్లు రూ.141.54 కోట్లు రూ.134.99 కోట్లు
పెదగంట్యాడ రూ.99.74 కోట్లు రూ.65.53 కోట్లు రూ. 62.32 కోట్లు
----------------------------------------------------------------------------------