తహశీల్దారు ఖాతాలో ఇనాం భూమి
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:03 AM
‘తహశీల్దార్ ఖాతా’ పేరుతో పెందుర్తి మండలంలో జరుగుతున్న భూ బాగోతంలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

పులగానిపాలెం సర్వే నంబరు 128లో 3.8 ఎకరాలు ఇనాం భూమి
దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ నివాసాలు ఏర్పాటుచేసుకున్న 16 రైతు కుటుంబాలు
పట్టాలు ఇవ్వాల్సిందిగా చాలాకాలంగా వినతులు
అడంగల్ 1-బిలో ముగ్గురి పేరిట 65 సెంట్లు మాత్రమే నమోదు
మిగిలిన 3.4 ఎకరాలు తహశీల్దారు ఖాతాలో...
మ్యుటేషన్‌లో కనిపించని పేరు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘తహశీల్దార్ ఖాతా’ పేరుతో పెందుర్తి మండలంలో జరుగుతున్న భూ బాగోతంలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో తహశీల్దార్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన అనంతరం మరణించిన లాలం సుధాకర్‌నాయుడు పేరుతో రెవెన్యూ సిబ్బంది ఇప్పటికీ అక్రమ వ్యవహారాలు నడుపుతున్నారు. గత నెల రెండో తేదీన పులగానిపాలెంలో దాదాపు పది ఎకరాల మ్యుటేషన్లకు అనుమతించారు. అదంతా సుధాకర్‌నాయుడి ఖాతా నంబర్‌పై ఉన్నదే కావడం గమనార్హం.
పెందుర్తి మండలం పులగానిపాలెం సర్వే నంబర్ 128లో 3.8 ఎకరాల ఇనాం భూమి ఉండగా మొత్తం 16 మంది రైతులు కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. వారంతా పట్టాలు ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కూడా దరఖాస్తులు ఇచ్చామని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. వారిలో కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే అడంగల్ రికార్డులో నమోదు చేసి, కేవలం 65 సెంట్లు చూపించారు. మిగిలిన 3.15 ఎకరాలను తహశీల్దార్ ఖాతా 9102లో చూపించి, పట్టాదారు పేరు వద్ద ‘వ్యవసాయ భూములు’ అని పేర్కొన్నారు. మ్యుటేషన్ జరిగిన తరువాత ఎవరి పేరున భూమి బదిలీ అయిందో వారి పేరు తప్పనిసరిగా అడంగల్ రికార్డులో నమోదు చేయాలి. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఈ వ్యవహారాలకు ఇంకా తహశీల్దార్ డిజిటల్ సంతకం జరగలేదని ‘ఎర్ర ఇంకు’ మార్కింగ్ చూపిస్తోంది.
సుధాకర్‌నాయుడు గత అక్టోబరులో మరణిస్తే ఆయన పేరు మీద జనవరి 2025లో మ్యుటేషన్ చేసినట్టు రికార్డుల్లో ఎందుకు కనిపిస్తున్నదని ప్రశ్నిస్తే అధికారులు సమాధానం ఇవ్వడం లేదు. తాము ఎవరికీ మ్యుటేషన్ చేయలేదని అంటున్నారు. కానీ రికార్డుల్లో 43 మ్యుటేషన్లు ఆమోదించినట్టు చూపిస్తోంది. పులగానిపాలెంలో రైతులు కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న ఇనాం భూమిని తహశీల్దార్ ఖాతాలో చేర్చడం వెనుక ఉద్దేశం ఏమిటనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామం జీవీఎంసీ 96వ వార్డు పరిధిలోకి వస్తుంది. అక్కడ ఎకరా రూ.20 కోట్లు ఉంటుంది. గత జనవరిలో తహశీల్దార్ పేరుతో సర్వే నంబరు 128 నుంచి మళ్లించిన 3.15 ఎకరాల విలువ రూ.60 కోట్ల పైమాటే. మ్యుటేషన్ జరిగిన తరువాత పట్టాదారు పేరు లేకుండా రికార్డులో ఎలా నమోదు చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జిల్లా అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నిక ఉండడంతో ఆ బిజీలో ఉన్నామని చెబుతున్నారు. ఈ వ్యవహారం కేవలం ఒక సర్వే నంబరులో 3.15 ఎకరాలదే. ఇంకా ఆ తహశీల్దార్ ఖాతాలో వివిధ గ్రామాల్లో 470 ఎకరాలు ఉన్నాయి. వాటిని చేజిక్కించుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనేది బయట పడాల్సి ఉంది.
మాకు అన్యాయం చేస్తున్నారు
సింగంపల్లి దేవుడమ్మ, కొరుపోలు సన్నిబాబు
పులగానిపాలెం సర్వే నంబర్ 128లో 3.8 ఎకరాల షరాబుల ఇనాం ఉంది. మొత్తం 16 కుటుంబాలు. మా తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే నివాసం ఉంటున్నాము. పట్టాలు ఇమ్మని రెవెన్యూ అధికారులను చాలా కాలంగా కోరుతున్నాము. ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులో కూడా దరఖాస్తులు ఇచ్చాము. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏ తహశీల్దార్‌కు గాను, ఇతరులకు గానీ భూమి లేదు. మేమే ఉంటున్నాం. మేము ఎవరికీ విక్రయించలేదు. మాకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోం.