Share News

వైసీపీ నేతల గుప్పెట్లోనే ఫిల్మ్‌ క్లబ్‌!

ABN , Publish Date - Feb 13 , 2025 | 01:15 AM

భీమిలి బీచ్‌ రోడ్డులోని ఫిల్మ్‌ నగర్‌ క్లబ్‌పై ఇంకా వైసీపీ నేతల ఆధిపత్యం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా అక్కడ పరిస్థితుల్లో వీసమెత్తు మార్పు రాలేదు. కార్యవర్గంలో చైర్మన్‌, కోశాధికారులు రాజీనామా చేసినా వాటిని ఆమోదించకుండా రాజకీయం చేస్తున్నారు. కొందరు క్లబ్‌ను గుప్పెట్లో పెట్టుకొని కోట్లాది రూపాయల డిపాజిట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారు.

వైసీపీ నేతల గుప్పెట్లోనే  ఫిల్మ్‌ క్లబ్‌!

ఇటీవల చైర్మన్‌, కోశాధికారి రాజీనామా

ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టిన కార్యవర్గం

కొనసాగేలా చక్రం తిప్పుతున్న కొందరు సభ్యులు

కూటమి నేతల కరుణ కోసం

నగరంలోని ఎమ్మెల్యేలందరికీ గౌరవ సభ్యత్వాలు

పోలీస్‌ అధికారులకు కూడా...

మరోవైపు నిర్వహణలో అనేక ఆరోపణలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భీమిలి బీచ్‌ రోడ్డులోని ఫిల్మ్‌ నగర్‌ క్లబ్‌పై ఇంకా వైసీపీ నేతల ఆధిపత్యం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైనా అక్కడ పరిస్థితుల్లో వీసమెత్తు మార్పు రాలేదు. కార్యవర్గంలో చైర్మన్‌, కోశాధికారులు రాజీనామా చేసినా వాటిని ఆమోదించకుండా రాజకీయం చేస్తున్నారు. కొందరు క్లబ్‌ను గుప్పెట్లో పెట్టుకొని కోట్లాది రూపాయల డిపాజిట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు క్లబ్‌కు వెళ్లి కార్యవర్గాన్ని రాజీనామా చేయాలని ఆదేశించారు. ఆ తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల క్లబ్‌ చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, కోశాధికారి గోపీనాథ్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. క్లబ్‌కు వెళ్లడం మానేశారు. అయితే కార్యవర్గంలో కొందరు ఆ రాజీనామాలకు ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో పెట్టారు. కూటమి నేతలను కలుస్తూ తామే కార్యవర్గంలో కొనసాగేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ఎమ్మెల్యేలందరికీ క్లబ్‌లో గౌరవ సభ్యత్వాలు ఇచ్చారు. అంటే వారు ఎటువంటి సభ్యత్వ రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలపై నిజంగా గౌరవం ఉంటే ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అవకాశం ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఇవ్వడమే అనుమానాలకు తావిస్తోంది. అక్కడితో ఆగకుండా జిల్లాలో పలువురు అధికారులకు కూడా ఉచిత సభ్యత్వాలు ఇచ్చారు. నగరంలోని ప్రముఖ క్లబ్‌లలో గ్రూప్‌-1 స్థాయి అధికారులకు ఉచిత సభ్యత్వాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది. రెవెన్యూలో అయితే ఆర్‌డీఓ స్థాయి, ఆపై అధికారులకు, పోలీసులకైతే డీఎస్‌పీ ఆ స్థాయి అధికారులకు ఇవ్వాలి. కానీ ఈ క్లబ్‌ మాత్రం సీఐ స్థాయి అధికారులకు కూడా ఉచితంగా సభ్యత్వాలు ఇస్తోంది. ఈ గౌరవ, ఉచిత సభ్యత్వాలన్నీ (సుమారు 50) జనరల్‌ బాడీ మీటింగ్‌లో చర్చించకుండానే ఇచ్చారని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. క్లబ్‌లో జరిగే గొడవలపై ఎటువంటి కేసులు లేకుండా ఉండేందుకే అధికారులు అందరికీ ఉచిత సభ్యత్వాలు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి.

పవన్‌కుమార్‌ చెప్పిందే వేదం

నగరంలో ఓ రెస్టారెంట్‌లో పనిచేసే పవన్‌కుమార్‌ అనే యువకుడిని కార్యవర్గంలోని ఒక వ్యక్తి తీసుకువచ్చి క్లబ్‌లో ఆపరేషన్‌ మేనేజర్‌గా నియమించారు. అప్పటి నుంచి సభ్యులు ఎవరైనా ఏదైనా ఈవెంట్‌ పెట్టుకుంటే...వాటికి అవసరమైనవన్నీ క్లబ్‌ నుంచే తీసుకోవాలని చెబుతున్నారు. బయట నుంచి ఫుడ్‌, ఫొటోగ్రాఫర్‌, డెకరేషన్‌, సింగర్స్‌ని తెచ్చుకుంటే వారికి ఇచ్చే మొత్తంలో 20 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల డిసెంబరు 31న నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన ఈవెంట్‌ నిర్వాహకులు కూడా రూమ్‌ అద్దె, ఫుడ్‌ బిల్లు కట్టాలని డిమాండ్‌ చేశారు. తాము ఈవెంట్‌ నిర్వహించడానికి వచ్చిన అతిథులమని, తమకు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత క్లబ్‌దని సదరు నిర్వాహకులు చెప్పగా, కార్యవర్గంతో మాట్లాడుకోవాలని, తనకు మాత్రం బిల్లు కట్టాలని పవన్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అక్కడ ఆయన మాటే వేదం. దీని వెనుక ఎవరు ఉన్నారనేది క్లబ్బులో అందరికీ తెలిసిందే.

నెల రోజులు గెస్ట్‌రూమ్‌లో...

పవన్‌కుమార్‌ ఇటీవల బయట ఎక్కడో ప్రమాదం జరిగి గాయపడ్డారు. క్లబ్‌లో సిబ్బందికి క్వార్టర్లు ఉన్నాయి. ఆయన్ను అక్కడ ఉంచి చికిత్స చేయించవచ్చు. కానీ అలా చేయకుండా క్లబ్‌లో ఐదు గెస్ట్‌ రూమ్‌లు ఉండగా అందులో ఒకటి ఆయనకు ఇచ్చారు. నెల రోజులు అందులో ఉంచారు. క్లబ్‌ నుంచే నెల రోజులూ ఆహారం పెట్టారు. ఆ రూమ్‌కి రోజుకు అద్దె సభ్యులకైతే రూ.2 వేలు. ఇతరులకైతే రూ.2,500. ఈ విషయం తెలిసి ఓ సభ్యుడు కార్యవర్గానికి లేఖ రాశారు. పవన్‌కుమార్‌ గెస్ట్‌ రూమ్‌ వాడడం వల్ల క్లబ్‌పై రూ.2.2 లక్షల భారం పడిందని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సిబ్బందిలో ఎవరు గాయపడినా ఇలాగే గెస్ట్‌రూమ్‌లో పెట్టి, చికిత్స చేస్తారా? ఫుడ్‌ పెడతారా? అని ప్రశ్నిస్తే...ఇప్పటివరకూ సమాధానం ఇవ్వలేదు. ఈ వపన్‌కుమారే క్లబ్‌కు అవసరమైన మెటీరియల్‌ అంతా కొంటారు. కిచెన్‌ ఇన్‌చార్జి ఆయనే. ఈవెంట్లకు ధరలు నిర్ణయించేదీ ఆయనే. ఒక వ్యక్తికి ఇన్ని బాధ్యతలు అప్పగించడమేమిటని పలువురు సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

మరికొన్ని ఆరోపణలు

- క్లబ్‌లో 50 సీసీ టీవీ కెమెరాలు పెట్టారు. వాటి ఫుటేజీ మొబైల్‌ యాక్సెస్‌ని కార్యవర్గంలో ఒక వ్యక్తి తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటివి చైర్మన్‌, సెక్రటరీ స్థాయి వారికి యాక్సెస్‌ ఇస్తారు. ఆ వ్యక్తికి ఎవరు ఇచ్చారనే దానికి సమాధానం లేదు.

- క్లబ్‌కు రూ.40 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయి. వీటిని ఇటీవల తరచూ బ్యాంకులు మారుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు తీసుకోవడానికి కొందరు కీలక వ్యక్తులు ఈ డిపాజిట్లను ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

క్యాంపు నుంచి వచ్చాక మాట్లాడతా

కాయల వెంకట రెడ్డి, చైర్మన్‌.

క్లబ్‌లో పదవికి రాజీనామా చేసిన అంశం నిజమా? కాదా? అని కాయల వెంకటరెడ్డికి ఫోన్‌ చేసి అడగగా అది ఇంకా ఆమోదం పొందలేదని సమాధానం ఇచ్చారు. ఇంకా అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పగా, తాను క్యాంపులో ఉన్నానని, వచ్చాక మాట్లాడతానని చెప్పారు.

Updated Date - Feb 13 , 2025 | 01:15 AM