Share News

పూర్ణామార్కెట్‌లో బినామీ దందాపై విచారణ

ABN , Publish Date - Feb 13 , 2025 | 01:07 AM

పూర్ణామార్కెట్‌లో బినామీ దందాపై జీవీఎంసీ అధికారులు విచారణ ప్రారంభించారు. పదుల సంఖ్యలో దుకాణాలను కొంతమంది చేజిక్కించుకుని అద్దెకు ఇచ్చుకుంటుండడంపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ‘పూర్ణామార్కెట్‌లో బినామీల దందా’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జోన్‌-4 కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు సమగ్ర విచారణ నిర్వహించాల్సిందిగా రెవెన్యూ అధికారి అప్పలరాజును ఆదేశించారు.

పూర్ణామార్కెట్‌లో  బినామీ దందాపై  విచారణ

జోన్‌-4 రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రారంభం

శానిటేషన్‌ ఉద్యోగి పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ

నేడో రేపు జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, కలెక్టర్‌కు నివేదిక

మార్కెట్‌లో గ్యాంగ్‌వేజ్‌ దుకాణాల కేటాయింపునకు

దరఖాస్తుల ఆహ్వానం

‘ఆంధ్ర జ్యోతి’ ఎఫెక్ట్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి):

పూర్ణామార్కెట్‌లో బినామీ దందాపై జీవీఎంసీ అధికారులు విచారణ ప్రారంభించారు. పదుల సంఖ్యలో దుకాణాలను కొంతమంది చేజిక్కించుకుని అద్దెకు ఇచ్చుకుంటుండడంపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ‘పూర్ణామార్కెట్‌లో బినామీల దందా’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జోన్‌-4 కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు సమగ్ర విచారణ నిర్వహించాల్సిందిగా రెవెన్యూ అధికారి అప్పలరాజును ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం మరో ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో కలిసి పూర్ణామార్కెట్‌కు వెళ్లారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంలోని వివరాల ఆధారంగా దుకాణాల వద్దకు వెళ్లి అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఆరా తీశారు. అనంతరం సంబంధితులతో మాట్లాడి...ఆ దుకాణాలు ఎలా వారికి వచ్చాయి, అందుకు ఎవరు సహకరించారనే వివరాలు రాబట్టారు. బినామీ దందాకు మార్కెట్‌ ఉన్న ప్రాంతంలో శానిటేషన్‌ ఉద్యోగే సహకారం అందించినట్టు ప్రాథమికంగా గుర్తించారని తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక తయారుచేసి జోన్‌-4 కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు ద్వారా జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌కు అందజేయనున్నారు. ఇన్‌చార్జి కమిషనర్‌ ఆదేశాలను బట్టి శానిటేషన్‌ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ ఐ.నరేష్‌కుమార్‌కు సిఫారసు చేస్తామని జీవీఎంసీ అధికారి ఒకరు వివరించారు. అలాగే బినామీ పేర్లతో ఉన్న దుకాణాలను స్వాధీనం చేసుకుని బయట వ్యాపారం చేసుకుంటున్న వారిలో అర్హులైన వారికి ప్రాధాన్యతా క్రమంలో కేటాయిస్తామని జోన్‌-4 కమిషనర్‌ తెలిపారు. పూర్ణామార్కెట్‌లో వ్యాపారం చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే జోన్‌-4 కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారికి పూర్ణామార్కెట్‌ లోపల గ్యాంగ్‌ వేజ్‌లోని దుకాణాలను ఉచితంగానే కేటాయిస్తామని జోనల్‌ కమిషనర్‌ తెలిపారు. గ్యాంగ్‌ వేజ్‌ దుకాణాలు పెట్టుకునేవారు రోజుకు రూ.35 మాత్రమే ఆశీల్‌ జీవీఎంసీకి చెల్లించాల్సి ఉంటుందన్నారు. అంతకుమించి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 01:07 AM