సంపతిపురం లేఅవుట్‌లో నకిలీ పట్టాలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:57 AM
రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ అనకాపల్లి మండలంలో ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతల హవా కొనసాగుతున్నది. వీరికి ఆయా శాఖల అధికారులు తమవంతు సహకారం అందిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తూరు పంచాయతీలోని పేదలకు సొంత గూడు కోసం సంపతిపురం పంచాయతీ పరిధిలో వేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లలో పలువురు అనర్హులకు పట్టాలు మంజూరు చేశారు. మండలానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి కుమారుడు తెరవెనుక కథ నడిపించి, ఒక్కొక్కరి నుంచి రూ.2-3 లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. స్థలాలు పొందిన వ్యక్తుల్లో కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

నాడు స్థానిక వైసీపీ నేత, రెవెన్యూ అధికారులు కుమ్మక్కు
లేవుట్‌లో మొత్తం 355 ప్లాట్లు
కొత్తూరు పంచాయతీకి చెందిన 303 మంది పేదలకు పట్టాలు
మిగిలిన 52 స్థలాలు అనధికారికంగా అనర్హులకు కేటాయింపు
ఒక్కొక్కరి నుంచి రూ.2-3 లక్షలు వసూలు
ఇళ్లు నిర్మించుకుంటున్న నకిలీ పట్టాదారులు
వైసీపీ నేత దందాపై అధికారులకు స్థానికులు ఫిర్యాదు
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పట్టించుకోని వైనం
కొత్తూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ అనకాపల్లి మండలంలో ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతల హవా కొనసాగుతున్నది. వీరికి ఆయా శాఖల అధికారులు తమవంతు సహకారం అందిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తూరు పంచాయతీలోని పేదలకు సొంత గూడు కోసం సంపతిపురం పంచాయతీ పరిధిలో వేసిన ఇళ్ల స్థలాల లేఅవుట్లలో పలువురు అనర్హులకు పట్టాలు మంజూరు చేశారు. మండలానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి కుమారుడు తెరవెనుక కథ నడిపించి, ఒక్కొక్కరి నుంచి రూ.2-3 లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. స్థలాలు పొందిన వ్యక్తుల్లో కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమంగా ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ఇళ్ల నిర్మాణం కొనసాగుతూనే వుంది. గృహ నిర్మాణ శాఖ అధికారులు మాత్రం తమ జాబితాలో పేర్లు లేనివారు ఇళ్ల నిర్మించుకున్నప్పటికీ బిల్లులు మాత్రం మంజూరు కావని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
అనకాపల్లి మండలంలో కొత్తూరు మేజర్ పంచాయతీలో సొంత ఇళ్లు లేని పేదలకు గత ప్రభుత్వం సంపతిపురం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 2/2లో 7.7 ఎకరాల్లో లేఅవుట్ వేసింది. ఒక్కో ప్లాట్ సెంటున్నర (72 గజాలు) చొప్పున మొత్తం 355 ప్లాట్లు వేశారు. కొత్తూరు పంచాయతీకి చెందిన 303 మంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా స్థలాలను మంజూరు చేసి పట్టాలు అందజేశారు అనంతరం పక్కా ఇళ్లు కూడా మంజూరు చేశారు. లేఅవుట్‌లో మరో 52 ప్లాట్లు మిగిలాయి. దీంతో వైసీపీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి కుమారుడు, రెవెన్యూ ఉద్యోగులు కుమ్మక్కయ్యారు. లేఅవుట్‌లో మిగిలిన ప్లాట్లకు నకిలీ పట్టాలు తయారు చేశారు. వీటిని సదరు వైసీపీ నాయకుడు తన అనుచురులకు పంచడంతో ఒక్కో ప్లాట్ రూ.2-3 లక్షలకు అమ్ముకున్నారు. కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది మునగపాక మండలానికి చెందిన వారని తెలిసింది. ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్లు మంజూరు కావని, మీరే సొంతంగా నిర్మించుకోవాలని ఆయా కొనుగోలుదారులకు చెప్పారు. మొత్తం మీద కోటి రూపాయలకుపైగా దండుకుని పంచుకున్నారు. అనధికారికంగా స్థలాలు పొందిన వారిలో కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సంపతిపురం లేఅవుట్‌లో అనర్హులకు, అనధికారికంగా ప్లాట్లు కేటాయించారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే కొంతమంది స్థానికులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి విచారణ జరపలేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నకిలీ పట్టాల బాగోతం బయటపడుతుందేమోనన్న భయంతో గతంలో అక్రమంగా పట్టాలు పొందిన వారిలో కొంతమంది ప్లాట్లను అమ్ముకోవడం మొదలుపెట్టారు. అయితే వారు భయపడినట్టుగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు విచారణ చేపట్టలేదు.. అక్రమంగా జారీ అయిన పట్టాలను రద్దు చేయలేదు. గృహ నిర్మాణాలను పర్యవేక్షించే అధికారులు సైతం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా పట్టాలు జారీ చేసిన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్ల బిల్లులు మంజూరు అవుతాయని, తమ లెక్క ప్రకారం 303 మంది లబ్ధిదారులు మాత్రమే వున్నారని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. మిగిలిన వారు (నకిలీపట్టాదారులు) సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటే తమకు సంబంధం లేదని, అదంతా రెవెన్యూ శాఖ వ్యవహారమని అన్నారు.
లబ్ధిదారులను భయపెట్టి భవన నిర్మాణ సామగ్రి అమ్మకం
ప్రభుత్వం నుంచి స్థలం, ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ అధికారులకు ఒక నంబరు కేటాయించారు. ఇంటి స్థలాన్ని జియో ట్యాగింగ్ చేశారు. అనంతరం లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సదరు వైసీపీ నేత వీరిని కూడా వదలలేదు. తన వెంట తిరిగే గ్యాంగ్‌ను లబ్ధిదారుల వద్దకు పంపించి, ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని తామే సరఫరా చేస్తామని, బయట కొనుగోలు చేసుకుంటే సామగ్రిని కాలనీలోకి అనుమతించేది లేదంటూ హుకుం జారీ చేశాడు. దీంతో భయపడిన కొంతమంది లబ్ధిదారులు.. అతను సరఫరా చేసిన మెటీరియల్‌ను తీసుకోవాల్సి వచ్చింది. మరికొంత మంది ఒప్పుకోకపోవడంతో మంత్రి అమర్‌నాథ్‌కు చెప్పి ఇంటి పట్టాను రద్దు చేయిస్తానని హెచ్చరించాడు. దీంతో వారు కూడా మెటీరియల్ కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణం
పేదలకు కేటాయించిన 72 గజాల స్థలంలో ఒక శ్లాబ్‌తో భవనం నిర్మించుకోవాలి. కానీ ఇక్కడ వైసీపీ నేత అండదండలతో సుమారు పది మంది రెండు అంతస్థుల భవనాలను నిర్మించారు. అయినా రెవెన్యూ, హౌసింగ్ అధికారులు పట్టించుకోవడంలేదు. వీరికి(రెండు అంతస్థులు నిర్మించిన) వైసీపీ నాయకుడు అండదండలు వుండడమే ఇందుకు కారణమని అంటున్నారు. కాగా సంపతిపురంలో నకిలీ పట్టాల జారీ, ఇళ్ల స్థలాల కేటాయింపుపై తహసీల్దార్, ఆర్డీవోలను వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్ చేయగా స్పందించలేదు.