Share News

ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి అస్వస్థత

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:21 PM

మండలంలోని పలకజీడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అనారోగ్యానికి గురైతే రెండు నెలల క్రితం ఇంటికి పంపేసిన సిబ్బంది ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి అస్వస్థత
అనారోగ్యానికి గురైన శుభలక్ష్మి

రెండు నెలల క్రితం ఇంటికి పంపేసి చేతులు దులిపేసుకున్న సిబ్బంది

సరైన వైద్యం అందక కదల్లేని స్థితిలో బాలిక

పట్టించుకోని అధికారులు

కొయ్యూరు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలకజీడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అనారోగ్యానికి గురైతే రెండు నెలల క్రితం ఇంటికి పంపేసిన సిబ్బంది ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీకే వీధి మండలం చిన అగ్రహారానికి చెందిన మాణిక శుభలక్ష్మి పలకజీడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం ఆ బాలిక అనారోగ్యానికి గురైంది. పాఠశాల సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఆ బాలిక తల్లి సన్యాసమ్మ కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ బాలికకు చెడుపు, చిల్లంగి పేరుతో తావీజులు కట్టించడం, గిరిజన సంప్రదాయ పద్ధతిలో గొరవడు(పూజారి)తో పూజలు చేయించడం, నాటు వైద్యం చేయిస్తోంది. అయితే ఆ బాలిక ఆరోగ్యం కుదుటపడకపోగా, మరింత క్షీణించి కదల్లేని స్థితికి వచ్చింది. విద్యార్థినిని ఇంటికి పంపేసిన పాఠశాల సిబ్బంది కనీసం ఎలా ఉందో ఆరా తీయలేదు. వైద్యం అందించి ఇంటికి పంపాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆ బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 12 , 2025 | 11:21 PM