ఎన్నికల కోడ్ ఉల్లంఘించి యథేచ్ఛగా మద్యం విక్రయాలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 10:54 PM
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా విచ్చలవిడిగా మద్యం సీసాలను విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా మద్యం సీసాలను, నగదు స్వాధీనం చేసుకున్నారు.

భారీగా మద్యం సీసాలు స్వాధీనం
పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు
సీలేరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా విచ్చలవిడిగా మద్యం సీసాలను విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా మద్యం సీసాలను, నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీలేరులో ఉన్న ఎంఎల్‌ఎం వైన్ షాపునకు మంగళవారం ఎక్సైజ్ సిబ్బంది సీల్ వేశారు. అయితే ఆ సమయంలో కొంత స్టాకును షాపు సిబ్బంది పక్కకు మళ్లించారు. ఆ స్టాకును అల్లూరి వీధిలోని ఓ ఇంట్లో భద్రపరిచి మంగళవారం నుంచి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడి చేశారు. 8 కేసుల మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.