Share News

భారీగా మద్యం అమ్మకాలు!

ABN , Publish Date - Jan 17 , 2025 | 02:04 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా మందుబాబులు ‘ఫుల్‌’ ఖుషీగా గడిపారు. సాధారణ రోజులతో పోలిస్తే మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయి.

భారీగా మద్యం అమ్మకాలు!

సంక్రాంతి సందర్భంగా తెగ తాగేసిన మందుబాబులు

రెండు రోజుల్లో రూ.12.91 కోట్ల వ్యాపారం

14,740 కేసుల లిక్కర్‌, 5,223 కేసుల బీర్‌ విక్రయం

సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపు!

అనకాపల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి పండుగ సందర్భంగా మందుబాబులు ‘ఫుల్‌’ ఖుషీగా గడిపారు. సాధారణ రోజులతో పోలిస్తే మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. పండగ సందర్భంగా మద్యం డిపోలకు మంగళ, బుధవారాలు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో లిక్కర్‌ షాపుల నిర్వాహకులు సోమవారంనాడు పెద్ద మొత్తంలో సరకు లిఫ్ట్‌ చేశారు. ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాలకు వలస పోయిన వారు సంక్రాంతి పండుగకు తప్పకుండా సొంతూరు వస్తుంటారు. పురుషులు మూడు రోజులపాటు మందు, ముక్కతో ఉల్లాసంగా గడుపుతుంటారు. దీంతో మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి. తద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. జిల్లాలో 146 మద్యం షాపులు, 10 బార్లు ఉన్నాయి. రోజువారీ సగటు మద్యం అమ్మకాలు రూ.3 కోట్లు. గత ఏడాది సంక్రాంతితో పోల్చిస్తే ఈసారి సంక్రాంతికి మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాది 14, 15 తేదీలో రూ.6 కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరగ్గా.. ఈసారి రూ.12.91 కోట్ల విక్రయాలు జరిగాయి. గత రెండు రోజుల్లో 14,740 లిక్కర్‌ కేసులు, 5,223 బీర్‌ కేసులు అమ్ముడుపోయాయి. జిల్లాలో గ్రామాలు, పట్టణాల్లో తీర్థాలు, పరసలు మొదలు కావడంతో రానున్న రోజుల్లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 02:04 AM