డోలీ మోతలు ఇంకెన్నాళ్లు?
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:44 PM
మండలంలోని వాలసీ పంచాయతీ బిచోల్‌రంగిని, పినకోట పంచాయతీ చిందులపాడు గ్రామాలకు రహదారి సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

మండలంలోని బిచోల్‌రంగిని, చిందులపాడు గ్రామస్థులకు తప్పని ఇబ్బందులు
రహదారి సౌకర్యం లేక అవస్థలు
అనంతగిరి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని వాలసీ పంచాయతీ బిచోల్‌రంగిని, పినకోట పంచాయతీ చిందులపాడు గ్రామాలకు రహదారి సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సోమవారం ఆయా గ్రామాలకు చెందిన ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో డోలీలో మూడు కిలో మీటర్ల మేర మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
మండలంలోని వాలసీ పంచాయతీ బిచోల్‌రంగిని గ్రామానికి చెందిన పాంగి రామారావు అనే గిరిజనుడు సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామం నుంచి వాలసీ రోడ్డు వరకు సుమారు మూడు కిలో మీటర్లు డోలీలో అతనిని మోసుకెళ్లారు. అక్కడ నుంచి ప్రైవేటు వాహనంలో లంగుపర్తి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు.
చిందులపాడు గ్రామంలో..
మండలంలోని పినకోట పంచాయతీ చిందులపాడు గ్రామానికి చెందిన కొర్రా సునీత సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో చిందులపాడు నుంచి దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ బల్లిగరువు గ్రామం వరకు సుమారు మూడు కిలో మీటర్లు ఆమెను కుటుంబ సభ్యులు డోలీలో మోసుకెళ్లారు. అక్కడ నుంచి ప్రైవేటు వాహనంలో దేవరాపల్లి ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చింతపాక నుంచి పెదబూరగ మీదుగా చిందులపాడు, తట్టబూడి కలుపుతూ సమిధ వరకు సుమారు రూ.16.65 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అయితే రోడ్డు పనులకు ఇప్పటికీ అటవీశాఖ జాయింట్ సర్వే చేపట్టకపోవడంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో డోలీ మోతలు తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు.