పేదలకు గృహ యోగం
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:24 PM
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఎన్నికల ముందు శ్లాబ్ వరకు నిర్మించి వదిలేసిన గృహాలను తొలిదశలో ఎంపిక చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు భావిస్తున్నారు.

నెరవేరనున్న సొంతింటి కల
పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాల కేటాయింపు
అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఎన్నికల ముందు శ్లాబ్ వరకు నిర్మించి వదిలేసిన గృహాలను తొలిదశలో ఎంపిక చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ విజయకృష్ణన్ ఇటీవల జిల్లా అధికారులతో సమావేశమై లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్ కింద 57,122 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ కింద 8,678.. మొత్తం 65,800 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 28,910 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. సుమారు 17,612 గృహ నిర్మాణాల పనులు ప్రారంభించలేదు. వివిధ దశల్లో పనులు నిలిచినవి 19,278 ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు 2016-17, 17-18 నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల కింద మంజూరు చేసి అసంపూర్తిగా దర్శనమిస్తున్న పేదల ఇళ్ల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు
కనీసం మౌలిక వసతులు లేని జగనన్న కాలనీలను రద్దు చేయడమే కాకుండా ఇకపై ఎన్టీఆర్ కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు నిర్మించనున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం గ్రామాల్లో పేదలకు ఇకపై మూడు సెంట్లు, పట్టణాల్లో అయితే రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వం వేసిన లేఅవుట్లలో ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల పట్టాలను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం నిర్మించనున్న ఎన్టీఆర్ కాలనీల్లో స్థలాలు కేటాయించనుంది. జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం 720 లేఅవుట్లు వేసింది. తొలి దశ కింద 65 వేల ఇళ్లు మంజూరు చేసింది. నివాసయోగ్యం కాని కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న స్థలాల్లో లేఅవుట్లు వేసింది. చాలామందికి లేఅవుట్లలో తమ ఇంటి స్థలం ఎక్కడ ఉందో తెలియక పట్టాలు చేతిలో పట్టుకొని అధికారుల చుట్టూ తిరిగేవారు. ఈ పరిస్థితులపై అధికారుల నుంచి కూటమి ప్రభుత్వం వివరాలు సేకరించింది. అలాగే కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసిన లబ్ధిదారులకు తాగునీరు, రహదారులు, ఇతరత్రా మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటోంది.