ప్రైవేటీకరణ ప్రతిపాదన గడిచిన చరిత్ర
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:44 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉద్యోగులు గత కొంతకాలంగా అనేక కష్టాలు పడుతున్నారని, అనేక త్యాగాలు కూడా చేశారని, అవన్నీ తమకు తెలుసునని, ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి ప్లాంటు ఉత్పత్తిని 100 శాతానికి చేర్చాలని కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాసవర్మలు కోరారు.

స్టీల్‌ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందంటే పునర్నిర్మాణం కోసమే...
ఉద్యోగులు, కార్మికులు అర్థం చేసుకోవాలి
కొంతకాలంగా అనేక కష్టాలు పడుతున్నారు, త్యాగాలు చేశారు...అన్నీ మాకు తెలుసు
మరింత కష్టపడి 100 శాతం ఉత్పత్తి సాధిద్దాం
ఏడాదిలోగా కష్టాలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయి
కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్.డి.కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాసవర్మ
కర్మాగారంలో ఉన్నతాధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం
విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉద్యోగులు గత కొంతకాలంగా అనేక కష్టాలు పడుతున్నారని, అనేక త్యాగాలు కూడా చేశారని, అవన్నీ తమకు తెలుసునని, ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి ప్లాంటు ఉత్పత్తిని 100 శాతానికి చేర్చాలని కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాసవర్మలు కోరారు. స్టీల్‌ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తరువాత తొలిసారిగా గురువారం విశాఖపట్నం వచ్చిన వారికి కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి స్టీల్‌ప్లాంటుకు వెళ్లేంత వరకూ అడుగడుగునా పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు కర్మాగారంలోని ఎల్ అండ్ డీసీలో ఉన్నతాధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్లాంటు ప్రైవేటీకరణ గురించి ఇంకా చాలామంది మాట్లాడుతున్నారని, అది గడిచిన చరిత్ర అని పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణకు 2021లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టి మరీ కేంద్రం ఆర్థిక సాయం చేసిందంటే...ప్లాంటు పునర్మిర్మాణం కోసమేనని, దీనిని కార్మికులు, ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరింత కష్టపడి రోజుకు 21 వేల నుంచి 24 వేల టన్నుల ఉత్పత్తి సాధిస్తే కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. ఏడాదిలోగా కష్టాలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. నెల నెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఇంకో మూడు నెలలే ఉంటుందని, ఆ తరువాత ప్రతి నెలా జీతాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. సెయిల్‌లో విలీనం కంటే ముందు ప్లాంటును నిలబెట్టడంపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు.సొంత గనుల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అన్నీ ఒకేసారి రావని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చిన నిధులు ఎలా సద్వినియోగం చేసుకోవాలో అధికారులకు దిశానిర్దేశం చేస్తామన్నారు. ప్లాంటుకు ఆర్థిక ప్యాకేజీ అందడంలో స్టీల్ సెక్రటరీ సందీప్ ఫౌండ్రీ పాత్ర కూడా ఉందని, సీఎండీ సక్సేనా కూడా ఈ నాలుగు నెలలు ప్లాంటును సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారని ప్రశంసించారు. ఉద్యోగులు, కార్మికులు అన్ని కష్టాలకు ఓర్చుకొని, సంయమనంతో రోజుకు 14 వేల టన్నులు ఉత్పత్తి తీస్తున్నారని, ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలని కోరారు.
విశాఖ స్టీల్‌ప్లాంటుకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని తిరుమల వెంకటేశ్వరస్వామిని ప్రార్థించానని కుమారస్వామి అన్నారు. సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంటుకు కేంద్రం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ఈ సమావేశంలో విశాఖ, విజయనగరం ఎంపీలు ఎం.శ్రీభరత్, కె.అప్పలనాయుడు, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, స్టీల్ ప్లాంటు డైరెక్టర్లు ఏకే బాగ్జీ, ఎస్‌సీ పాండే, ఎస్‌ఆర్‌వీజీకె గణేష్, జీవీఎస్.ప్రసాద్, సీవీవో కరుణరాజు, ఉక్కు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదరి సంజయ్‌రాయ్, సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీవిశ్వనాథరాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు, అధికారులు, నాయకులు, వివిధ అసోసియేషన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.