ఉక్కు ఉద్యోగులకు అధిక పెన్షన్
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:06 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సమస్యలను ఒక్కొక్కటిగా కూటమి నాయకులు పరిష్కరిస్తున్నారు.

సమస్య పరిష్కారానికి ఢిల్లీలో ఎంపీ ఎం.శ్రీభరత్, విశాఖలో ఎమ్మెల్యే పల్లా కృషి
ప్రశంసలతో ముంచెత్తిన ఉద్యోగ సంఘాలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సమస్యలను ఒక్కొక్కటిగా కూటమి నాయకులు పరిష్కరిస్తున్నారు. ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపడానికి కేంద్రం ఇటీవల రూ.11,440 కోట్ల సాయం చేయగా, తాజాగా ఐరన్‌ఓర్ సరఫరాకు ఎన్‌ఎండీసీ బుధవారం ఒప్పందం చేసింది. ఇపుడు గత 15 నెలలుగా స్టీల్‌ప్లాంటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ‘అధిక పెన్షన్’ సమస్యను ఢిల్లీలో విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, విశాఖలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు కలిసి పరిష్కరించారు. దీనివల్ల రిటైరైన, ప్రస్తుతం పనిచేస్తున్న ఐదు వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అధిక పెన్షన్ల కోసం స్థానిక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఫీల్డ్ ఆఫీస్ జారీచేసిన నోటీసులకు స్పందించి ప్లాంటులో అధిక పెన్షన్ కోరుకున్నవారు 15 నెలల క్రితం రూ.410 కోట్లు డిపాజిట్ చేశారు. అప్పటి నుంచి అధిక పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వందలాది మంది ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఉద్యోగ సంఘాల నాయకులు విశాఖ ఎంపీ శ్రీభరత్‌ను, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి సమస్య వివరించారు. దీనిపై ఎంపీ శ్రీభరత్...కేంద్ర కార్మిక శాఖా మంత్రి మనసుఖ్ మాండవీయను కలిసి పెన్షన్లు విడుదల చేయాలని కోరారు. ఆలస్యానికి కారణాలు తెలుసుకొని ఢిల్లీలో ఈపీఎఫ్‌ఓ కార్యాలయంపై ఒత్తిడి పెట్టారు. ఇక్కడ స్టీల్ ప్లాంటు రీజనల్ కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు తరచూ సమీక్షలు నిర్వహించి పెన్షన్లు మంజూరుకు యత్నించారు. వీరిద్దరి కృషి ఫలితంగా అధిక పెన్షన్లకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో ఐదు వేల మందికి ప్రయోజనం కలిగింది. దీంతో విశాఖ ఉక్కు ఉద్యోగ వర్గాలన్నీ ఎంపీ శ్రీభరత్‌కు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావకు కృతజ్ఞతలు తెలిపారు. ప్లాంటుకు సంబంధించిన సమస్యలపై సకాలంలో స్పందించి పరిష్కరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.