Share News

హై స్పీడ్‌గా మన్యంలో వే

ABN , Publish Date - Feb 07 , 2025 | 10:07 PM

జిల్లాలో జాతీయరహదారి నిర్మాణం హై స్పీడుగా సాగుతోంది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం హైవే నిర్మాణం పరుగు పెడుతోంది.

హై స్పీడ్‌గా మన్యంలో వే
హుకుంపేట - కించుమండ గ్రామాల మధ్య ఒంపులు తిరుగుతూ సుందరంగా ఉన్న హైవే రోడ్డు

రాజమహేంద్రవరం నుంచి అల్లూరి జిల్లా

మీదుగా విజయనగరం వరకు నిర్మాణం

2020లో పనులు ప్రారంభం

మొత్తం రోడ్డు పొడవు 370 కిలోమీటర్లు

నిర్మాణ అంచనా వ్యయం రూ.1,575 కోట్లు

ఇప్పటికే పూర్తయిన పాడేరు-అరకులోయ రోడ్డు

చురుగ్గా కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి,

జి.మాడుగుల మండలాల్లో పనులు

(పాడేరు/ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జాతీయరహదారి నిర్మాణం హై స్పీడుగా సాగుతోంది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం హైవే నిర్మాణం పరుగు పెడుతోంది.

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు, అరకులోయ, అనంతగిరి మీదుగా విజయనగరం జిల్లా బొడ్డవర వరకు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు 370 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,575 కోట్లు మంజూరు చేసింది. అందులో భాగంగా పాడేరు నుంచి హుకుంపేట, డుంబ్రిగుడ మీదుగా అరకులోయ మండలం కొత్తభల్లుగూడ వరకు హైవే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. అలాగే అరకులోయ మండలం కొత్తభల్లుగుడ నుంచి అనంతగిరి మండల మీదుగా విజయనగరం జిల్లా బొడ్డవర వరకు భూమి సేకరణ చేపట్టారు.

43 కిలోమీటర్లలో పనులు ప్రారంభించాల్సి ఉంది..

ఏజెన్సీలో ప్రస్తుతం ఉన్న 23 అడుగుల రోడ్డును 74 అడుగులకు వెడల్పు చేస్తున్నారు. అందులో 34 అడుగులు తారురోడ్డు కాగా, ఇరువైపులా 20 అడుగుల చొప్పున మట్టి రోడ్డు వేస్తున్నారు. అవసరమైన చోట్ల కల్వర్టులు, వంతెనలు నిర్మిస్తున్నారు. మలుపులను తగ్గిస్తూ రోడ్డు మార్గం నేరుగా ఉండేలా కొండలను సైతం తొలుస్తున్నారు. ప్రస్తుతం పాడేరు నుంచి అరకులోయ వరకు రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో స్థానికులతోపాటు పర్యాటకులు సైతం ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు.

హుకుంపేట మండలం పెదగరువు వద్ద టోల్‌ ప్లాజా

జాతీయ రహదారి 516ఈకి సంబంధించి జిల్లాలోని హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ పరిధి పెదగరువు వద్ద టోల్‌ ప్లాజాను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గదులు, కంపార్ట్‌మెంట్‌ల నిర్మాణం 80 శాతం పూర్తయ్యింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే అప్పటి నుంచి ఇక్కడ టోల్‌ వసూలు చేసే అవకాశముందని అంటున్నారు.

జాతీయ రహదారికి 2018లోనే కార్యరూపం

తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ ఏజెన్సీ మీదుగా విజయనగరానికి జాతీయ రహదారిని నిర్మించాలనే ప్రతిపాదన 2018లోనే కార్యరూపం దాల్చింది. ఏజెన్సీలో కొయ్యూరు నుంచి చింతపల్లి, పాడేరు మీదుగా అరకులోయ వరకు ఉన్న 12 అడుగుల వెడల్పు ఉన్న ప్రధాన రహదారిని 23 అడుగుల రహదారిగా ఆర్‌అండ్‌బీ అధికారులు విస్తరిస్తే, తర్వాత దానిని తాము 74 అడుగుల జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామని నేషనల్‌ రోడ్స్‌ అథారిటీ అఽధికారులు ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. అందులో భాగంగానే 2018, 2019 సంవత్సరాల్లో ఏజెన్సీలోని కొయ్యూరు నుంచి పాడేరు, అరకులోయ వరకు ఉన్న రోడ్డును 12 అడుగుల నుంచి 23 అడుగులకు విస్తరించారు. ఆయా రోడ్డు విస్తరణ పనులు పూర్తికావడంతో జాతీయ రహదారి నిర్మాణానికి నేషనల్‌ రోడ్స్‌ అథారిటీ అధికారులు రంగంలోకి 2020లో దిగారు. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం, కాకరపాడు, లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, బొడ్డవర(విజయనగరం జిల్లా) వరకు మొత్తం 370 కిలోమీటర్ల రోడ్డును ఆరు బ్లాక్‌లుగా విభజించారు.

జాతీయ రహదారి ఆరు బ్లాకులు

1. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం 44 కిలోమీటర్లు

2, రంపచోడవరం టూ కారకపాడు 74 కిలోమీటర్లు

3. కాకరపాడు టూ లంబసింగి మీదుగా పాడేరు 133 కిలోమీటర్లు

4. పాడేరు నుంచి కొత్తభల్లుగుడకు 49 కిలోమీటర్లు

5. కొత్తభల్లుగుడ నుంచి బొడ్డవరకు 43 కిలోమీటర్లు

6, బొడ్డవర టూ విజయనగరం 27 కిలోమీటర్లు

హైవే నిర్మాణంతో మెరుగుపడనున్న రవాణా

తూర్పుగోదావరి జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా విజయనగరం జిల్లాను కలుపుతూ జాతీయ రహదారిని నిర్మించడం వల్ల గిరిజన ప్రాంతంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. అంతేకాకుండా అనేక అంశాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటోంది. ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిశా రాష్ట్రానికి నిత్యం రాకపోకలు సాగుతున్నాయి. అలాగే కొయ్యూరు, సీలేరు, లంబసింగి, జి.మాడుగుల, పాడేరు, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాలు సైతం పర్యాటకంగా దినదినాభివృద్ధి చెందుతున్నాయి. దీంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబంగా, తెలంగాణా రాష్ట్రాల నుంచి నిత్యం లంబసింగి, పాడేరు, అరకులోయ ప్రాంతాలకు వాహనాల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తున్నారు. జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే పర్యాటకంగా, సరుకుల రవాణాపరంగా, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Feb 07 , 2025 | 10:07 PM