Share News

సర్కారీ బడులు వెలవెల!

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:19 AM

నూతన విద్యా విధానం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసింది. ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు పరిధిలో వున్న ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులను మాత్రమే వుంచి, మిగిలిన మూడు తరగతులను హైస్కూళ్లలో విలీనం చేసింది. ఫలితంగా పలు ప్రాథమిక పాఠశాలల్లో పట్టుమని పది మంది కాదుకదా.. కనీసం ఐదారుగురు విద్యార్థులు కూడా లేరు. ఈ తరహా పాఠశాలలు మాకవరపాలెం మండలంలో పదికిపైగా వున్నాయి.

సర్కారీ బడులు వెలవెల!
సుభద్రయ్యపాలెం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

గత ప్రభుత్వ తీరుతో ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యం

పట్టుమని పది మంది విద్యార్థులు కూడా లేని వైనం

మాకవరపాలెం మండలంలో మూడు స్కూళ్లలో ఇద్దరేసి పిల్లలు

మరో నాలుగు పాఠశాలల్లో మూడు నుంచి ఏడుగురు

టీచర్లు సమయపాలన పాటించడంలేదని ఆరోపణలు

మాకవరపాలెం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యా విధానం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసింది. ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు పరిధిలో వున్న ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులను మాత్రమే వుంచి, మిగిలిన మూడు తరగతులను హైస్కూళ్లలో విలీనం చేసింది. ఫలితంగా పలు ప్రాథమిక పాఠశాలల్లో పట్టుమని పది మంది కాదుకదా.. కనీసం ఐదారుగురు విద్యార్థులు కూడా లేరు. ఈ తరహా పాఠశాలలు మాకవరపాలెం మండలంలో పదికిపైగా వున్నాయి.

మాకవరపాలెం మండలం సుభద్రయ్యపాలెం పాఠశాలలో గత మూడేళ్ల నుంచి ఇద్దరు విద్యార్థులు మాత్రమే వున్నారు. వీరు మూడో తరగతిలోకి వచ్చేనాటికి మిగిలిన నాలుగు తరగతుల్లో ఒక్కరు కూడా లేరు. గత రెండేళ్లలో ఒకటో తరగతిలో ఒక్కరు కూడా చేరలేదు. ఇద్దరు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఒక ఉపాధ్యాయుడు వున్నారు. విద్యార్థులు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో హైస్కూల్‌కి వెళ్లిపోతారు. ఒకటో తరగతిలో ఎవరైనా చేరితే సరి.. లేకుండా పాఠశాల మూతపడుతుంది. అలాగే వెంకయ్యపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు వున్నారు. నాలుగేళ్ల నుంచి ఈ ఇద్దరే చదువుకుంటున్నారు. వీరికి పాఠాలు బోధించడానికి ఒక టీచర్‌ ఉన్నారు. బూరుగుపాలెంలో కూడా ఇదే పరిస్థితి. ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు.

మల్లవరం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, పెద్దిపాలెంలో ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, బుచ్చన్నపాలెంలో ఏడుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, జి.కోడూరు పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, నగరం గ్రామంలో అత్యధికంగా 14 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇటువంటి పాఠశాలలపై మండల విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణ కోరవడడంతో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంఈవో-1 జాన్‌ప్రసాద్‌ పాయకరావుపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా, రోలుగుంట ఇన్‌చార్జి ఎంఈవోగా త్రిపాత్రాభినయనం చేస్తుండడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

Updated Date - Jan 18 , 2025 | 12:19 AM