Share News

జాతీయ రహదారిపై హ్యాపీ జర్నీ

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:38 AM

చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో ఒకప్పుడు ప్రయాణమంటే వాహనచోదకులు ఇబ్బందులు పడేవారు. మలుపులు తిరిగిన ఇరుకు రోడ్డులో ప్రయాణం కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి 516-ఈ పనులు శరవేగంగా జరుగుతుండడంతో చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

జాతీయ రహదారిపై హ్యాపీ జర్నీ
అందంగా తయారైన చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు

శరవేగంగా నేషనల్‌ హైవే 516-ఈ పనులు

సగానికి తగ్గిన ప్రయాణ సమయం

చింతాలమ్మ ఘాట్‌ విశాలంగా, అందంగా తయారుకావడంతో ప్రయాణం సులభం

కొయ్యూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో ఒకప్పుడు ప్రయాణమంటే వాహనచోదకులు ఇబ్బందులు పడేవారు. మలుపులు తిరిగిన ఇరుకు రోడ్డులో ప్రయాణం కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి 516-ఈ పనులు శరవేగంగా జరుగుతుండడంతో చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 516-ఈ పనుల వల్ల వివిధ ప్రాంతాలకు ప్రయాణ సమయం సగానికి తగ్గిందని మండల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాడేరు- అరకు మధ్య మొదటి దశలో నిర్మాణ పనులు పూర్తి చేయగా, రంపచోడవరం జంక్షన్‌ నుంచి కొయ్యూరు, కృష్ణాదేవిపేట మీదుగా రొంపుల ఘాట్‌, లంబసింగి, జి.మాడుగుల, పాడేరుకు నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే రంపచోడవరం నుంచి కొయ్యూరు, అలాగే కొయ్యూరు నుంచి చింతాలమ్మ ఘాట్‌ మీదుగా కాట్రగెడ్డ వరకు రోడ్డు నిర్మాణాలు పూర్తికాగా, మధ్యలో ఉన్న వంతెనలకు అప్రోచ్‌ రోడ్లు వేస్తున్నారు. ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడినా ప్రమాదాలు జరగకుండా సీసీ గోడలు, రాతి కట్టడాలు నిర్మించారు. అయితే ముందుగా నిర్ణయించిన మేరకు కృష్ణాదేవిపేట నుంచి నర్సీపట్నం మీదుగా లంబసింగి కలుపుదామనుకున్న ఈ జాతీయ రహదారిని మార్పు చేసి కృష్ణాదేవిపేట నుంచి డైవర్షన్‌ ఇచ్చారు. దీంతో కృష్ణాదేవిపేట నుంచి కొయ్యూరుకు జాతీయ రహదారి నిర్మాణం జరగక ముందు బస్సు ప్రయాణం గంట పట్టేది. పనులు పూర్తి కావడంతో ఇప్పుడు 30 నిమిషాల్లో చేరుకుంటోంది. వాహనదారులైతే 20 నిమిషాల్లో చేరుకుంటున్నారు. చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు విశాలంగా ఉండడంతో పాటు అందంగా తయారుకావడంతో ప్రయాణం సులభమైందని వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 06 , 2025 | 12:38 AM