Share News

మహా గోప్యం!

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:53 AM

సిబ్బంది తప్పు చేస్తే మరోసారి పునరావృతం కాకుండా చూడాలని అధికారులు మందలించాలి.

మహా గోప్యం!

  • జీవీఎంసీలో బిల్లుల చెల్లింపు వివరాలు రహస్యం

  • ఇతర అధికారులకూ తెలియకుండా కట్టుదిట్టం

  • పోర్టల్‌లో మార్పులు చేసిన యంత్రాంగం

  • ఐటీ, అకౌంట్స్‌ విభాగాలతోపాటు ఏడీసీకి మాత్రమే యాక్సిస్‌

  • బిల్లుల చెల్లింపు అక్రమాలను ఇటీవల వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’

  • దీంతో స్టేటస్‌ ఇతరులు చూసేందుకు వీలు లేకుండా చర్యలు

  • తప్పులు కప్పిపుచ్చుకునే దిశగా యత్నాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సిబ్బంది తప్పు చేస్తే మరోసారి పునరావృతం కాకుండా చూడాలని అధికారులు మందలించాలి. కానీ ఘనత వహించిన మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు అక్రమాలు వెలుగుచూస్తే సరిదిద్దుకోవడంపై దృష్టిపెట్టకుండా, అవి బయటపడకుండా చర్యలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో భాగంగా జీవీఎంసీలోని ఇతర అధికారులకు కూడా తెలియకుండా పోర్టల్‌ను కట్టుదిట్టం చేయడం విశేషం.

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. వీటిని చేపట్టేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి సంబంధిత అధికారులు, స్టాండింగ్‌ కమిటీ, జీవీఎంసీ కౌన్సిల్‌ ఆమోదంతో టెండర్లు పిలుస్తారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్‌ పనులు పూర్తిచేసిన తర్వాత ఎం-బుక్‌లో నమోదుచేసి, బిల్లు కోసం సంబంధిత జోన్‌ డ్రాయింగ్‌ బ్రాంచి (డీబీ) ద్వారా కమిషనర్‌కు సిఫారసు చేస్తారు. ఎం-బుక్‌ రికార్డింగ్‌ జరిగి డీబీకి చేరిన తర్వాత అక్కడ అధికారులు వాటిని పరిశీలించి బిల్లు సిద్ధం చేస్తారు. అనంతరం జనరల్‌ ఓచర్‌ (ఈఏ నంబరు) ఇస్తారు. ఓచర్‌ నంబరు సీరియల్‌ ఆధారంగా అధికారులు చెల్లింపులు జరుపుతుంటారు.

జీవీఎంసీలో ఇష్టారాజ్యం

జీవీఎంసీలో ప్రస్తుతం బిల్లుల చెల్లింపు పరిశీలిస్తే ఫిబ్రవరిలో ఓచర్‌ రైజ్‌ అయిన పనులకు బిల్లులు చెల్లించేశారు. ఆ తర్వాత బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలోని కొందరు పెద్దలు జీవీఎంసీ బిల్లుల చెల్లింపులో కీలకంగా వ్యవహరించే అధికారులను ప్రసన్నం చేసుకుని, అక్టోబరులో ఓచర్‌ రైజ్‌ అయిన పనులకు అడ్డదారిలో పేమెంట్లు తీసుకున్నారు. మరికొంతమంది ప్రజా ప్రతినిధులతో సిఫారసు చేయించుకుని బిల్లులు చేసుకున్నారు. దీనివల్ల పది నెలల కిందట పని పూర్తిచేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో జీవీఎంసీ అధికారులతోపాటు కాంట్రాక్టర్లలో కలకలం రేగింది.

చక్రం తిప్పిన అధికారులు

అడ్డదారిలో బిల్లులు చేసిన వైనం పూర్తి ఆధారాలతో వెలుగుచూసిన నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. బిల్లుల చెల్లింపు, ఏ బిల్లు చెల్లింపు ప్రక్రియ ఎవరి వద్ద పెండింగ్‌లో ఉందనే వివరాలు ఇంజనీరింగ్‌ అధికారులతోపాటు డ్రాయింగ్‌ బ్రాంచిలోని అధికారులు, సిబ్బందికి కూడా తెలియకుండా పోర్టల్‌లో మార్పులు చేశారు. బిల్లుల వివరాలు కేవలం అదనపు కమిషనర్‌ (ఫైనాన్స్‌), అకౌంట్స్‌, ఐటీ విభాగాల సిబ్బంది మాత్రమే చూసేలా యాక్సిస్‌లో ఉంచారు. మిగిలిన ఇంజనీర్లు, డ్రాయింగ్‌ బ్రాంచిలకు ఆ అవకాశం లేకుండా చేశారు. దీనివల్ల బిల్లుల చెల్లింపులో ఎన్ని అక్రమాలు జరిగినా బయటకు తెలిసే అవకాశం లేకుండాపోయింది.

Updated Date - Jan 04 , 2025 | 12:53 AM