Share News

గ్రేటర్‌లో బరితెగింపు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:42 AM

పనుల్లో నాణ్యత ఉండడం లేదని, సకాలంలో పూర్తిచేయకపోతున్నారని జీవీఎంసీ కమిషనర్‌ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన కాంట్రాక్టర్లు తిరిగి టెండర్లలో పాల్గొంటున్నా...ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు అండదండలు అందిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గ్రేటర్‌లో బరితెగింపు

  • అడ్డగోలుగా వ్యవహరిస్తున్న జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం

  • బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగింత

  • ఓ అధికారి సహకారం

  • వారి టెండర్లను అనుమతించాలని డీబీలకు ఆదేశం

  • పనులు చేయకపోయినా బిల్లులు చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని ఆరోపణలు

  • విజిలెన్స్‌ అధికారులు దృష్టిసారిస్తే అక్రమాలు బట్టబయలయ్యే అవకాశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పనుల్లో నాణ్యత ఉండడం లేదని, సకాలంలో పూర్తిచేయకపోతున్నారని జీవీఎంసీ కమిషనర్‌ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన కాంట్రాక్టర్లు తిరిగి టెండర్లలో పాల్గొంటున్నా...ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు అండదండలు అందిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తిస్థాయిలో పనులు చేయకపోయినా బిల్లు చెల్లించేలా ముందస్తు ఒప్పందం కూడా కుదిరినట్టు తెలుస్తోంది.

జీవీఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, భవనాలు, ప్రహరీల నిర్మాణం, పార్కులు, ల్యాండ్‌ స్కేపింగ్‌, పచ్చదనం పెంపు వంటి పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తుంటారు. పని విలువను బట్టి అర్హత, అనుభవం కలిగిన కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్‌ వేసేందుకు అధికారులు అనుమతిస్తారు. పని దక్కించుకున్న కాంట్రాక్టర్‌ జీవీఎంసీతో అగ్రిమెంట్‌ చేసుకున్న తర్వాత సకాలంలో పని పూర్తిచేయడంలో విఫలమైనా, నాణ్యత లోపించినా...ఇంజనీరింగ్‌ అధికారుల సిఫారసు మేరకు కమిషనర్‌ ఆయా కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న కాలపరిమితి ముగిసేంత వరకూ వారు జీవీఎంసీ టెండర్లలో పాల్గొనడానికి వీలుండదు. జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘంలో నాయకుడిగా చలామణి అవుతున్న కాంట్రాక్టర్‌ ఒకరు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడంతో గతంలో కమిషనర్‌గా పనిచేసిన లక్ష్మీషా 2026 వరకూ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేశారు. అయినప్పటికీ సదరు కాంట్రాక్టర్‌ తాను యూనియన్‌లో నాయకుడినని అధికారులను బెదిరించి టెండర్లలో పాల్గొంటున్నారు. అదేమాదిరిగా ఇద్దరు స్టీల్‌ప్లాంటు ఉద్యోగులు తమ భార్యల పేర్లతో లైసెన్స్‌ పొంది హార్టికల్చర్‌ విభాగంలో పనులు చేపడుతున్నట్టు గత ఏడాది సెప్టెంబరులో ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించడంతో అప్పటి కమిషనర్‌ సంపత్‌కుమార్‌ స్పందించి వారిద్దరినీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. హార్టికల్చర్‌, ఇంజనీరింగ్‌ అధికారులను పిలిచి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన వారి టెండర్లను అనుమతిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ ఇటీవల జోన్‌-2 పరిధి తోటగరువు ఉన్నత పాఠశాల ఆవరణలో ఎర్రమట్టి వేసేందుకు రూ.7.8 లక్షల అంచనా వ్యయంతో, జోన్‌-5 పరిధి పాస్‌పోర్ట్‌ కార్యాలయం ఎదుట గ్రీన్‌ బెల్ట్‌లో వాకింగ్‌ ట్రాక్‌లో ఎర్రమట్టి నింపేందుకు రూ.16.58 లక్షలతో టెండర్లు పిలవగా దాదాపు 34 శాతం లెస్‌కు వేసి మరీ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న స్టీల్‌ప్లాంటు ఉద్యోగి భార్య పనులు దక్కించుకోవడం విశేషం.

బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నా సరే యథేచ్ఛగా టెండర్లు

బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నప్పటికీ జోన్‌-5 పరిధిలో వార్డు సచివాలయ భవన నిర్మాణానికి కాంట్రాక్టర్ల సంఘం నేత టెండర్‌ వేశారు. టెండర్‌ వేసినప్పటికీ టెక్నికల్‌ బిడ్‌ను తెరిచినప్పుడు ఇంజనీరింగ్‌ విభాగంలోని సంబంధిత జోన్‌ డ్రాయింగ్‌ బ్రాంచ్‌ (డీబీ) తిరస్కరించాలి. కానీ అటువంటిదేమీ లేకుండా...అందరికంటే ఎక్కువ లెస్‌కు వేశారంటూ వారికే పనులను కేటాయించేస్తున్నారు.

ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారి అండదండలు:

జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 11 మంది కాంట్రాక్టర్లు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నారు. వీరు ఎవరైనా ఏదైనా టెండర్‌లో పాల్గొంటే సంబంధిత జోన్‌ డీబీ వాటిని పరిశీలించి, తిరస్కరించాల్సి ఉంటుంది. కానీ వారు ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. పైగా వారే ఎక్కువ లెస్‌కు టెండర్‌ వేశారంటూ పనులు అప్పగించి అగ్రిమెంట్‌ చేసుకుంటున్నారు. మిగిలిన కాంట్రాక్టర్లు ఎవరైనా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిని పరోక్షంగా అధికారులు బెదిరిస్తున్నారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నప్పటికీ పనులు దక్కించుకుంటున్న ఇద్దరు కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్‌ విభాగంలోని ఒక ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు పూర్తిగా చేయకపోయినా బిల్లుల చెల్లింపులో అడ్డంకులు లేకుండా ఉండేందుకు సదరు అధికారి నుంచి హామీ లభించడంతోనే భారీగా లెస్‌లకు వేసి టెండర్లు దక్కించుకుంటున్నారని చెబుతున్నారు. సదరు అధికారి నేరుగా ఫోన్‌ చేసి ఆదేశిస్తుండడంతో తమకు మరో మరోమార్గం లేక వారి టెండర్లను అనుమతిస్తున్నామని డీబీలు గగ్గోలుపెడుతున్నారు. దీనిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దృష్టిసారిస్తే భారీగా అక్రమాలు బయటపడతాయని అంటున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:42 AM