Share News

రోడ్డెక్కిన గ్రూప్‌-2 అభ్యర్థులు

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:02 AM

రోస్టర్‌ విధానంలో సవరణలు చేసిన తరువాతే గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి వందలాది మంది అభ్యర్థులు నగరంలోని ఇసుక తోట జంక్షన్‌లో జాతీయ రహదారిపై బైఠాయించారు.

రోడ్డెక్కిన గ్రూప్‌-2 అభ్యర్థులు

  • ఇసుకతోట జంక్షన్‌లో హైవేపై బైఠాయింపు

  • రోస్టర్‌ విధానంలో సవరణలు చేసిన తరువాతే పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):

రోస్టర్‌ విధానంలో సవరణలు చేసిన తరువాతే గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి వందలాది మంది అభ్యర్థులు నగరంలోని ఇసుక తోట జంక్షన్‌లో జాతీయ రహదారిపై బైఠాయించారు. తొలుత సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎంవీపీ కాలనీలోని సర్కిల్‌ వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా ఇసుక తోట జంక్షన్‌కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేయాలని, రోస్టర్‌ విధానాన్ని సరిచేయాలని డిమాండ్‌ చేశారు. అభ్యర్థుల ఆందోళనతో జాతీయ రహదారిపై ఇటు మద్దిలపాలెం, అటు హనుమంతువాక జంక్షన్‌ వరకూ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు మద్దిలపాలెం నుంచి హనుమంతువాక వైపు వెళ్లాల్సిన వాహనాలను కృష్ణా కాలేజీ, వెంకోజీపాలెం మీదుగా మళ్లించారు. అలాగే అటు నుంచి రావాల్సిన వాహనాలను హనుమంతువాక జంక్షన్‌ వద్ద నుంచి విశాలాక్షి నగర్‌, ఎంవీపీ కాలనీ మీదుగా నగరంలోకి మళ్లించారు. మరోవైపు ఆందోళనకు దిగిన అభ్యర్థులతో పలువురు ఉన్నతాధికారులు వచ్చి సంప్రతింపులు జరిపారు. ఇలా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయడం సబబు కాదంటూ నచ్చజెప్పేందుకు యత్నించారు. అయినప్పటికీ అభ్యర్థులు శాంతించకుండా ఆందోళనను కొనసాగిస్తున్నారు.

నేడు గ్రూప్‌-2 పరీక్ష

11,029 మంది అభ్యర్థులు

16 కేంద్రాలు

అభ్యర్థుల ఆందోళనతో భద్రత కట్టుదిట్టం

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని 16 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ గ్రూప్‌-2 పరీక్ష జరగనున్నది. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకూ, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకూ పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. అయితే 15 నిమిషాలు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. ఉదయం 9.45, మధ్యాహ్నం 2.45 గంటల తరువాత వచ్చే అభ్యర్థులకు అనుమతించేది లేదని హాల్‌టిక్కెట్లలోనే ఏపీపీఎస్సీ స్పష్టంచేసింది. ఈ పరీక్షలకు 11,029 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఏపీపీఎస్సీ అధికారులు తప్ప ఇతర సిబ్బంది సెల్‌ఫోన్లు, అభ్యర్థులు ఎలకా్ట్రనిక్‌ పరికరాలు తీసుకువెళ్లకూడదు. పరీక్షల నిర్వహణపై శనివారం సాయంత్రం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

గ్రూప్‌-2 పరీక్షలకు సంబంధించి జిల్లా యంత్రాంగం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేసింది. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే...0891-2590100, 0891-2590102కు ఫోన్‌ చేయాలని డీఆర్వో బీహెచ్‌ భవానీశంకర్‌ కోరారు. కంట్రోల్‌రూమ్‌లో ఇద్దరు ఉద్యోగులు అందుబాటులో ఉంటారన్నారు. ఏపీపీఎస్సీకి చెందిన అసిస్టెంట్‌ సెక్రటరీ పి.అశోక్‌ (ఫోన్‌ నంబరు 9014550879) కంట్రోల్‌ రూమ్‌లో ఉంటూ అందరినీ సమన్వయం చేస్తారని పేర్కొన్నారు.

అప్రమత్తం

గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు నగరంలో ఆందోళనలు నిర్వహిస్తుండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అభ్యర్థులు కలెక్టరేట్‌ను ముట్టడిస్తారన్న సమాచారంతో శనివారం ఉదయం నుంచి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం పరీక్ష ముగిసేంత వరకు 16 కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ను జిల్లా యంత్రాంగం కోరింది. ఆదివారం ఉదయం పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనలు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.

Updated Date - Feb 23 , 2025 | 01:02 AM