Share News

ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్ష

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:29 AM

జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

ప్రశాంతంగా గ్రూప్‌-2 పరీక్ష

  • 85.04 శాతం మంది అభ్యర్థులు హాజరు

  • ఉదయం 9,391, మధ్యాహ్నం 9,370 మంది..

  • విశాఖ జిల్లాలో 16 కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

  • పరీక్ష తీరును పరిశీలించిన కలెక్టర్‌, జేసీ, సీపీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కొమ్మాదిలో ఓ అభ్యర్థి పరీక్ష రాస్తూ తీవ్ర అస్వస్థతకు గురవడం, ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో పరీక్ష గదులు గుర్తించడంలో కొందరు అభ్యర్థులు గందరగోళానికి గురవడం మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. పరీక్ష వాయిదా వేయాలని రెండు, మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు వస్తారన్న సమాచారంతో నగరంలో అన్ని కేంద్రాల వద్ద పోలీసులు విస్తృతస్థాయిలో బందోబస్తు ఏర్పాటుచేశారు.

అభ్యర్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు నిర్దేశిత సమయం కంటే ముందుగానే చేరుకున్నారు. ఉదయం 6.30 గంటలకు లైజన్‌ అధికారులు పరీక్షల మెటీరియల్‌తో కేంద్రాలకు చేరుకున్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి పోలీసు భద్రత మధ్య ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తరలించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించిన పరీక్షకు ఉదయం ఎనిమిదిగంటల తరువాత, మధ్యాహ్నం మూడు నుంచి జరిగే పరీక్షకు రెండు గంటల తరువాత అభ్యర్థులను లోపలకు అనుమతించారు. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో అభ్యర్థులు క్యూకట్టారు. ప్రతి ఒక్కర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతించారు. అయితే ఇంజనీరింగ్‌ కళాశాలలో పలు విభాగాల్లో ఏర్పాటుచేసిన గదులు గుర్తించేలా నిర్వాహకులు సైన్‌బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గరయ్యారు.

జిల్లాలోని 16 కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు మొత్తం 11,030మంది దరఖాస్తుచేయగా ఉదయం 9,391 మంది (85.14శాతం), మధ్యాహ్నం 9,370 (84.95శాతం )హాజరయ్యారు. మొత్తం 85.04 శాతం అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు తెలిపారు. ఉదయం పరీక్ష రాసిన వారిలో 21 మంది మధ్యాహ్నం పరీక్షకు హాజరుకాలేదు. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం పరీక్ష రాసిన భీమిలి మండలం రేఖవానిపాలేనికి చెందిన పి.గంగరాజు మధ్యాహ్నం పరీక్షకు హాజరైన అరగంట తరువాత వాంతులు చేసుకోవడంతో ఇన్విజిలేటర్‌, చీఫ్‌సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చారు. అతడికి రక్తపోటు తగ్గడంతో వెంటనే ప్రథమ చికిత్స చేసి, సమీపంలోని గాయత్రి వైద్య కళాశాలకు తరలించారు. కాగా నాగరాజు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలావుండగా ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగిన పరీక్షను కలెక్టర్‌ ఎంఎన్‌.హరేంధిరప్రసాద్‌, సీపీ డాక్టర్‌ శంఖబ్రతబాగ్చి తనిఖీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో న్యూక్లాస్‌రూమ్‌ కాంప్లెక్స్‌, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రిజం డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటుచేసిన కేంద్రాలను పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్న తీరును డీఆర్వో భవానీశంకర్‌ కలెక్టరేట్‌లోని కంటోల్ర్‌రూమ్‌ నుంచి పర్యవేక్షించారు. పోలీసులు అన్ని కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పరీక్ష వాయిదా వేయాలని మూడు రోజులుగా ఆందోళన చేసిన అభ్యర్థులు ఆదివారం కేంద్రాలకు రాకపోవడంతో పోలీసులు, జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

Updated Date - Feb 24 , 2025 | 12:29 AM