కొమ్ముశనగ ప్రయోగాత్మక సాగు సక్సెస్
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:21 AM
గిరిజన ప్రాంతంలో రైతులు రబీ కాలంలో నీటి సదుపాయం లేని పంట పొలాల్లో కొమ్ముశనగ సాగు చేసుకోవచ్చునని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు.

రబీలో నీటి సదుపాయం లేకుండా సాగు
మంచు ఆధారంగా పండించి అధిక దిగుబడులు
సాగు విస్తీర్ణం పెంపునకు ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తల ప్రణాళిక
చింతపల్లి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో రైతులు రబీ కాలంలో నీటి సదుపాయం లేని పంట పొలాల్లో కొమ్ముశనగ సాగు చేసుకోవచ్చునని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆదివాసీ రైతులతో ప్రయోగాత్మకంగా చేపట్టిన కొమ్ముశనగ సాగు విజయవంతమైంది. కేవలం మంచు ఆధారంగా పంటను సాగు చేసి ఎకరాకు అధిక దిగుబడులు సాధించారు.
గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు నీటి సదుపాయం లేని వ్యవసాయ భూములను ఖాళీగా విడిచిపెడుతున్నారు. దీంతో వీరికి రబీలో రెండవ పంట లేకుండాపోతున్నది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహపరిశోధన సంచాలకులు(ఏడీఆర్) డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి రబీలో కేవలం మంచు ఆధారంగా సాగు చేసే పంటలను రైతులకు పరిచయం చేయాలని ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి విడతగా గూడెంకొత్తవీధి మండలం దామనాపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంలో కోడ సోమయ్య, పల్లంనాయుడు రైతులకు చెందిన రెండు ఎకరాల పంట పొలాల్లో విస్తరణ విభాగం శాస్త్రవేత్త పి.బాలహుస్సేన్ రెడ్డి పర్యవేక్షణలో కొమ్ముశనగ నంద్యాల బెంగాల్ గ్రామ్ రకం విత్తనాల నాట్లు 2024 నవంబరు 8వ తేదీన వేయించారు. శాస్త్రవేత్తల సహకారంతో నీటి సదుపాయం లేకుండా రైతులు పంటను సాగు చేశారు. ఈ పంటను ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన పంటను కోశారు. ఎకరానికి 280 కిలోల దిగుబడులు వచ్చాయి.
మూడు నెలల్లో రూ.20 వేల ఆదాయం
గిరిజన రైతులు రబీ కాలంలో ఖాళీగా విడిచిపెట్టే పంట పొలాల్లో ఎకరం విస్తీర్ణంలో కొమ్ముశనగ సాగు చేపట్టి మూడు నెలల్లో ఖర్చులు పోనూ రూ.20 వేల ఆదాయం పొందవచ్చునని ప్రయోగాత్మకంగా రైతులతో నిరూపించారు. దామనాపల్లి గ్రామ పంచాయతీలో గిరిజన రైతులు సాగు చేసిన కొమ్ముశనగ పంట ఎకరం విస్తీర్ణంలో సాగు చేసేందుకు విత్తనం ఖర్చు రూ.మూడు వేలు, ట్రాక్టర్‌తో దుక్కి చేసేందుకు రూ.వెయ్యి, విత్తడానికి కూలీల ఖర్చు రూ.400, ఆర్గానిక్ పురుగుల మందు పిచికారీకి రూ.500, కలుపు తీతకు కూలీల ఖర్చు రూ.400, పంట కోత, నూర్పు చేసేందుకు రూ.1400 ఖర్చు చేశారు. ఎకరం విస్తీర్ణంలో కొమ్ముశనగ సాగుకి మొత్తం రూ.6,700 ఖర్చు చేశారు. ఎకరం పంట పొలంలో వచ్చిన 280 ఆర్గానిక్ కొమ్ముశనగ గింజలను కిలో రూ.96 ధరకు విక్రయించడంతో రూ.26,880 ఆదాయం వచ్చింది. ఖర్చులో రూ.6,700 పోను నికరంగా ఆదాయం రూ.20,180 ఆదాయం వచ్చింది.