Share News

మహా దోబూచులాట

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:12 AM

ఆస్తి పన్ను చెల్లించడం లేదని వేమన మందిరానికి జీవీఎంసీ జోన్‌-4 రెవెన్యూ అధికారులు మంగళవారం సీల్‌ వేశారు. అయితే నిర్వాహకులు ఒక్క రూపాయి చెల్లించకపోయినప్పటికీ వేసిన సీల్‌ను వెంటనే తొలగించేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మహా దోబూచులాట

ఆస్తి పన్ను చెల్లించడం లేదని

వేమన మందిరానికి తాళం

రూపాయి కట్టకపోయినా

తిరిగి లీజుదారులకు అప్పగింత

వైసీపీ నేత ఒత్తిడికి తలొగ్గిన అధికారులు

విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

ఆస్తి పన్ను చెల్లించడం లేదని వేమన మందిరానికి జీవీఎంసీ జోన్‌-4 రెవెన్యూ అధికారులు మంగళవారం సీల్‌ వేశారు. అయితే నిర్వాహకులు ఒక్క రూపాయి చెల్లించకపోయినప్పటికీ వేసిన సీల్‌ను వెంటనే తొలగించేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆశీల్‌మెట్ట కూడలిలోని వేమన మందిరాన్ని జీవీఎంసీ 25 ఏళ్ల కిందట ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చింది. మూడేళ్లకు ఒకసారి లీజును పొడిగించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం నిర్వా హకులు నెలకు కేవలం రూ.4,200 చొప్పున అద్దె చెల్లిస్తున్నట్టు సమాచారం. లీజును ఇంకా పొడిగించడానికి నిబంధనలు అంగీకరించవని, అద్దె బకాయిలు చెల్లించి మందిరాన్ని తమకు అప్పగించాలని కొద్దికాలం కిందట అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు తమకు లీజు పొడిగించాలని కోరుతూ గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కాగా నోటీసులు జారీచేసినా నిర్వాహకులు స్పందించకపోవడంతో వేమన మందిరానికి జీవీఎంసీ జోన్‌-4 రెవెన్యూ అధికారులు మంగళవారం సీల్‌ వేశారు. అయితే ఎలాంటి బకాయి చెల్లించకపోయినప్పటికీ సీల్‌ను తొలగించి మళ్లీ ప్రైవేటు వ్యక్తులకే అప్పగించేశారు. జీవీఎంసీ పాలక వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేత ఒకరు ఫోన్‌ చేసి ఒత్తిడి చేయడంతోనే అధికారులు తలొగ్గి బకాయిలు చెల్లించకపోయినా సీల్‌ను తొలగించారని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - Jan 30 , 2025 | 01:12 AM