Share News

గోవాడ షుగర్స్‌ కార్మికుల ఆందోళన

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:59 AM

వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన ఆందోళన సంక్రాంతి పండగ అనంతరం గురువారం తిరిగి మొదలైంది.

గోవాడ షుగర్స్‌ కార్మికుల ఆందోళన

వేతన బకాయిలు చెల్లింపులో ఎండీ మాట నిలుపుకోలేదని ఆరోపణ

మోకాళ్లపై నిల్చుని నిరసన

చెరకు క్రషింగ్‌ ప్రారంభంపై సందిగ్ధత

చోడవరం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి):

వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన ఆందోళన సంక్రాంతి పండగ అనంతరం గురువారం తిరిగి మొదలైంది. వేతనాల చెల్లింపు విషయంలో మాటనిలబెట్టుకోని యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా కార్మికులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. వేతన బకాయిలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కార్మికులు వారం రోజుల క్రితం ఆందోళన ప్రారంభించి, ఎండీ సన్యాసినాయుడుని నిర్బంధించిన సంగతి తెలిసిందే. సంక్రాంతినాటికి వేతనాలు చెల్లించేలా చూస్తామని ఇచ్చిన హామీని ఎండీ అమలు చేయలేకపోయారు. దీంతో పండుగ మూడు రోజుల విరామం ఇచ్చిన కార్మికులు.. తిరిగి గురువారం ఫ్యాక్టరీ ఆవరణలో ఆందోళన ప్రారంభించారు. ఈ సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కేవీవీఎస్‌ భాస్కరరావు మాట్లాడుతూ, వేతన బకాయిలు చెల్లించేంత వరకు కార్మికులు విధులకు హాజరుకారని స్పష్టం చేశారు.

చెరకు క్రషింగ్‌ మరింత జాప్యం

సంక్రాంతి పండుగ తరువాత రెగ్యులర్‌ క్రషింగ్‌ ప్రారంభించడానికి యాజమాన్యం సిద్ధమైంది. కానీ బకాయి వేతనాల విషయమై కార్మికులు ఆందోళనకు దిగడంతో చివరి దశ పనుల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. దీంతో శుక్రవారం ప్రారంభం కావలసిన చెరకు క్రషింగ్‌ను వాయిదా వేశారు. క్రషింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఫ్యాక్టరీవర్గాలు చెప్పలేకపోతున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది చెరకు క్రషింగ్‌ నెల రోజులకుపైగా ఆలస్యమైంది. క్రషింగ్‌ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, కూటమి నేతలు స్పందించి షుగర్‌ ఫ్యాక్టరీలో పరిస్థితులను చక్కదిద్ది, సత్వరమే చెరకు క్రషింగ్‌ ప్రారంభించేలా చూడాలని రైతులు రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 01:59 AM