Share News

గోవాడకు తీరని కష్టాలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:34 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని ఆర్థిక కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఫ్యాక్టరీ నిర్వహణకు సైతం నిధులు లేకపోవడంతో చెరకు క్రషింగ్‌పై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నది. ఇటీవల వరకు సాంకేతిక సమస్యలతో తరచూ చెరకు క్రషింగ్‌ ఆగిపోగా, పరిస్థితి కుదుటపడి క్ర షింగ్‌ గాడిలో పడుతున్న సమయంలో కాటాల నుంచి చెరకు రవాణా అస్తవ్యస్తంగా తయారైంది. లారీలకు కిరాయి బకాయిలు పేరుకుపోవడంతో చెరకు రవాణాకు లారీల యజమానులు నిరాకరిస్తున్నారు.

గోవాడకు తీరని కష్టాలు
మాడుగుల మండలం ఎం.కె.వల్లాపురం కాటా వద్ద చెరకు బండ్లు

షుగర్‌ ఫ్యాక్టరీ నిర్వహణకు నిధుల కొరత

లారీలకు కిరాయి సైతం చెల్లించలేని దుస్థితి

కాటాల నుంచి ఫ్యాక్టరీకి చెరకు సరఫరాపై ప్రభావం

చెరకు బండ్లతో రోజుల తరబడి రైతులు నిరీక్షణ

అమలుకాని కూటమి నేతల హామీలు

ప్రభుత్వం నుంచి కొరవడిన సహకారం

చోడవరం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని ఆర్థిక కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఫ్యాక్టరీ నిర్వహణకు సైతం నిధులు లేకపోవడంతో చెరకు క్రషింగ్‌పై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నది. ఇటీవల వరకు సాంకేతిక సమస్యలతో తరచూ చెరకు క్రషింగ్‌ ఆగిపోగా, పరిస్థితి కుదుటపడి క్ర షింగ్‌ గాడిలో పడుతున్న సమయంలో కాటాల నుంచి చెరకు రవాణా అస్తవ్యస్తంగా తయారైంది. లారీలకు కిరాయి బకాయిలు పేరుకుపోవడంతో చెరకు రవాణాకు లారీల యజమానులు నిరాకరిస్తున్నారు. దీంతో కాటాల నుంచి ఫ్యాక్టరీకి చెరకు తెచ్చుకోవడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. కాటాల వద్ద చెరకు బండ్లు రోజుల తరబడి వేచివుండాల్సి వస్తున్నది. కాటాల వద్దకు తీసుకువచ్చిన చెరకును సకాలంలో ఫ్యాక్టరీకి తరలించకపోవడంతో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. కాటాల వద్ద రోజుల తరబడి వుండిపోవడంతో చెరకు ఎండిపోయి, బరువుతోపాటు రసనాణ్యత తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని నిధుల కొరత వెంటాడుతున్నది. ప్రస్తుత క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభం కాకముందే.. ఓవర్‌ హాలింగ్‌ పనులతోపాటు, సీజన్‌ నిర్వహణకు కనీసం రూ.5 కోట్లు సాయం అందించాలని ఫ్యాక్టరీ అధికారులు... ప్రజాప్రతినిధులను, కలెక్టర్‌ను, ఇతర ఉన్నతాధికారులను పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా ఆదుకోకపోతే చెరకు క్రషింగ్‌ సాధ్యం కాదంటూ పరిస్థితిని వివరించారు. కానీ ఇంతవరకు సానుకూలంగా ఎటువంటి స్పందన రాలేదు. ప్రభుత్వ సహకారం లేకుండా క్రషింగ్‌ను కొనసాగించవలసి రావడం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గోవాడ ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తుందని రైతులు భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత లభించే పరిస్థితి లేకపోవడంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేయడానికి ముందుకు వస్తుండడం ఒక్కటే ఊరట కలిగిస్తున్న అంశం. అయితే చెరకు క్రషింగ్‌ చేయడం యాజమాన్యానికి గగనంగా మారింది. ఓవర్‌హాలింగ్‌ పనులకుతోడు ఫ్యాక్టరీ రన్నింగ్‌కు అవసరమైన నిధులు యాజమాన్యం వద్ద లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఫ్యాక్టరీలో క్రషింగ్‌కు అవసరమైన బగాస్‌ స్థానంలో వరి ఊక కొనడానికి సైతం మధ్యవర్తుల సాయంతో అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు. ఇక ఫ్యాక్టరీలో అత్యవసరమైన విడిభాగాల కొనుగోలుకు సైతం తడుముకోవలసి వస్తున్నదని కార్మికులు అంటున్నారు.

వెంటాడుతున్న నిధుల కొరత

ఫ్యాక్టరీ నిర్వహణకు అత్యవసర నిధులు ఉండాలి. ఫ్యాక్టరీకి రావలసిన విద్యుత్‌ బకాయిలు రూ.85 లక్షలు రెండు వారాల క్రితం విడుదలయ్యాయి. మొలాసిస్‌ కొనుగోలుకు సంబంధించి విశాఖ డెయిరీ యాజమాన్యం నుంచి రూ. కోటి 25 లక్షలు, పంచదార విక్రయాలకు సంబంధించి మార్క్‌ఫెడ్‌ నుంచి రూ.75 లక్షలు రావలసి ఉంది. ఫ్యాక్టరీలో నాలుగు వేల క్వింటాళ్ల పంచదార ఉంది. టెండరుదారుడు ఈ పంచదార తీసుకెళ్లవలసి ఉంది. దీనివల్ల కోటి 60 లక్షల రూపాయలు వస్తాయి. గోవాడకు సుమారు రూ.3 కోట్ల 60 లక్షల వరకూ రావాల్సి వుంది. కానీ అవి ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.

ప్రకటనలకే పరిమితమైన సాయం

గోవాడ షుగర్స్‌ను గాడిలో పెట్టడంతోపాటు, ఫ్యాక్టరీని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎంపీ ఎమ్మెల్యేలు, జనసేన నేతలు చెబుతున్నారు ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకుని వస్తామని గట్టిగానే హామీలు ఇచ్చారు. ఎంపీ ఒకసారి, ఎమ్మెల్యేలు రెండుసార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం లభించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.5 కోట్లు అయినా ప్రభుత్వం కేటాయించకపోతే ఫ్యాక్టరీలో క్రషింగ్‌ సాఫీగా జరిగే పరిస్థితి లేదని అంటున్నారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి పూర్వవైభవం సంగతి అటుంచి.. కనీసం మనుగడ కోసం అయినా ప్రభుత్వం సాయం అందించాలని చెరకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు కోరుతున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:34 AM