ప్రభుత్వ భూమి కబ్జా
ABN , Publish Date - Mar 09 , 2025 | 01:08 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలైనా గాజువాక నియోజకవర్గంలో కొందరు రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఇంకా వైసీపీ నేతల కనుసన్నల్లోనే నడుచుకుంటున్నారు.

దర్జాగా కళ్యాణ మండపం నిర్మాణం
వైసీపీ నేత కుమారుడి అండదండలు
చర్యలు తీసుకునేందుకు వెళ్లిన టౌన్‌ప్లానింగ్ అధికారులకు బ్రేకులు
చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం
గాజువాకలో అరాచకం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలైనా గాజువాక నియోజకవర్గంలో కొందరు రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఇంకా వైసీపీ నేతల కనుసన్నల్లోనే నడుచుకుంటున్నారు. దయాల్‌నగర్ కొండను వైసీపీ ముఖ్య నేత కుమారుడు తన సొంత జాగీరుగా మార్చేసుకున్నా పట్టనట్టు వ్యవహరించిన రెవెన్యూ అధికారులు, తాజాగా ఆయన అండతో ప్రభుత్వ భూమిలో జరుగుతున్న భారీ కళ్యాణ మండపం పనులకు తమ వంతు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గాజువాక బీసీ రోడ్డును ఆనుకుని దయాల్ నగర్ కొండ సమీపాన సర్వే నంబర్ 43/1డిలో ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని ఆనుకుని వైసీపీకి చెందిన కార్పొరేటర్ (ప్రస్తుతం టీడీపీలో చేరిపోయారు) అనుచరుడికి కొంత స్థలం ఉంది. అనుచరుడి పేరుతో ఉన్నప్పటికీ కార్పొరేటర్‌దేనని స్థానికులు చెబుతుంటారు. తన అనుచరుడి పేరిట ఉన్న ఆ స్థలానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కలిపేసుకుంటే అక్కడ భారీ కళ్యాణ మండపం (కన్వెన్షన్ సెంటర్) నిర్మించవచ్చునని సదరు కార్పొరేటర్ భావించారు. అనుకున్నదే తడవుగా తనకు అత్యంత ఆప్తుడు, ఆ ప్రాంతంలో పెద్దఎత్తున దందాలకు పాల్పడుతున్న వైసీపీ నేత కుమారుడిని కలిశారు. తన వాటా తనకు ఇచ్చేస్తే సంపూర్ణ సహకారం అందిస్తానని వైసీపీ నేత కుమారుడు భరోసా ఇచ్చారు. ఇద్దరి మఽధ్య ఒప్పందం కుదరడంతో తన అనుచరుడి పేరుతో ఉన్న స్థలంతోపాటు దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కలిపేసుకుని భారీ కళ్యాణ మండపం నిర్మాణ పనులు ప్రారంభించారు. దీనిపై కొందరు జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎలాంటి ప్లాన్ లేకుండా కళ్యాణ మండపం నిర్మిస్తున్నట్టు గుర్తించి కొన్నాళ్ల కిందట యంత్రాలతో తొలగించేందుకు సిద్ధపడ్డారు. ఇంతలో వైసీపీ నేత కుమారుడు జోక్యం చేసుకోవడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగింపు పనులను మధ్యలోనే వదిలేసి వెనుతిరిగారు. తర్వాత యథావిధిగా కళ్యాణ మండపం నిర్మాణపనులు జరిగిపోతున్నాయి. దీనిపై స్థానికులు కొందరు రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పట్టించుకోకపోవడంతో ఆ స్థలం, యాజమాన్య హక్కుల వివరాలను ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద కోరగా, అందులో కొంత ప్రభుత్వ స్థలం ఉన్నట్టు సమాధానం ఇచ్చారు. దాని ప్రకారం కళ్యాణ మండపం నిర్మాణాన్ని ఆపి, ప్రభుత్వ భూమిని సంరక్షించాలని కోరగా, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుటామని షరతు విధిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే తమను వైసీపీ నేత కుమారుడు ఏమైనా చేస్తారేమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కళ్యాణ మండపం నిర్మించడంపై గాజువాక జోన్ టౌన్‌ప్లానింగ్ అధికారులను వివరణ కోరగా, పరిశీలించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పడం విశేషం. జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.