Share News

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Mar 09 , 2025 | 01:05 AM

మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, బాలికల అభ్యున్నతికి అటు సమాజం, ఇటు తల్లిదండ్రులు సంపూర్ణంగా ప్రోత్సాహం అందించాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట
కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, జేసీ అభిషేక్‌గౌడ, ఏఎస్‌పీ ధీరజ్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, తదితరులు

- తల్లిదండ్రులు, సమాజం బాలికలను ప్రోత్సహించాలి

- కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

- ఘనంగా మహిళా దినోత్సవం

పాడేరు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, బాలికల అభ్యున్నతికి అటు సమాజం, ఇటు తల్లిదండ్రులు సంపూర్ణంగా ప్రోత్సాహం అందించాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి అధ్యక్షతన స్థానిక వీఆర్‌ ఫంక్షన్‌ హాలులో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. మహిళలు మరింత చైతన్యవంతం కావాలని, ప్రతి ఒక్కరూ మహిళాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. స్త్రీలు తమలోని శక్తిని గుర్తించాలని, దానికి అనుగుణంగా ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకునేందుకు గల కారణాలు, పరిస్థితులను కలెక్టర్‌ వివరించారు. బాలికలకు యుక్త వయస్సు వచ్చిన తరువాత పెళ్లి చేసేసి పంపేయాలనే ఆలోచన నుంచి ప్రతి ఒక్కరూ బయటపడాలన్నారు. అలాగే బాలికలు, మహిళలకు ఎక్కడైనా ఎటువంటి వేధింపులు ఎదురైనా తక్షణమే మహిళా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 181కు కాల్‌ చేయాలని ఆయన సూచించారు. మహిళాభ్యున్నతికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కు కల్పించిన ఘనత దివంగత నేత నందమూరి తారక రామారావుదేనని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతోపాటు నారా చంద్రబాబునాయుడు సీఎం అయిన తరువాత మహిళలు మరింతగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేశారన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అందరూ మహిళలను ప్రోత్సహించాలని, చిన్నచూపు చూడరాదన్నారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధిగా రూ.5లక్షల 5 వేలు, బ్యాంకు లింకేజీగా రూ.57 కోట్ల 89 లక్షలు, ఉన్నతి రుణాలుగా రూ.39 లక్షలు, నారీ శక్తిలో రూ.8లక్షలు, పీఎంజీపీలో రూ.5 లక్షలు చెక్కుల రూపంలో అతిథులు వారికి అందజేశారు. అనంతరం వివిధ రంగాల్లోని మహిళలకు సత్కరించారు. అలాగే ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్న మహిళా దినోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ అందరూ వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, అడిషనల్‌ ఎస్‌పీ కె.ధీరజ్‌, జిల్లా రెవెన్యూ అధికారిణి కె.పద్మలత, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మోతునాయుడు, ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, టీడబ్ల్యూ డీడీ ఎల్‌.రజని, ట్రైకార్‌ డైరెక్టర్‌ కూడ కృష్ణారావు, ఎంపీపీ ఎస్‌.రత్నకుమారి, టీడీపీ నేత డప్పొడి వెంకటరమణ, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు.

పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌పీ ఎస్కే. సహబాజ్‌ అహ్మద్‌, సీఐ అప్పలనాయుడు, మహిళా ఎస్‌ఐ శకుంతల, బాలికలు పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీలో థింసా నృత్యాలతో సందడి

స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని థింసా నృత్యాలతో ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలత, సిబ్బంది, విద్యార్థులు తొలుత కేకు కట్‌ చేసుకుని, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం అందరూ థింసా నృత్యాలు చేశారు.

మినుములూరులో ప్రత్యేకంగా వేడుకలు

మండలంలో మినుమలూరు పంచాయతీ కేంద్రంలో ప్రత్యేకంగా మండల స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 పంచాయతీలను ఆదర్శ మహిళా స్నేహపూర్వక పంచాయతీలుగా ప్రభుత్వ గుర్తించగా, వాటిలో మినుములూరు పంచాయతీ ఉంది. దీంతో మినుములూరులో ప్రత్యేకంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరావజు, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, సర్పంచ్‌ లంకెలచిట్టమ్మ, కార్యదర్శి అనుషా, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2025 | 01:05 AM