Share News

ఉక్కుకు మంచి రోజులు

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:46 AM

‘విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అనే మాట పదికాలాలు నిలిచేలా కూటమి ప్రభుత్వం చేసింది.

ఉక్కుకు మంచి రోజులు

  • తొలగనున్న చిక్కులు

  • రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం

  • తక్షణం రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు

  • పూర్తిస్థాయిలో పనిచేసేలా చూస్తామని ప్రకటన

  • ఆగస్టు నుంచి మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ అందుబాటులోకి...

  • ఐరన్‌ఓర్‌ సరఫరాకు ఎన్‌ఎండీసీతో చర్చలు

  • ఇక ఉత్పత్తి పరుగులే

  • మాట నిలుపుకున్న కూటమి నేతలు

  • కార్మిక వర్గాల హర్షం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అనే మాట పదికాలాలు నిలిచేలా కూటమి ప్రభుత్వం చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న స్టీల్‌ప్లాంటుకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. తక్షణమే రెండు బ్లాస్ట్‌ఫర్నేస్‌లు పూర్తికాలం పనిచేసేలా, ఆగస్టు నుంచి మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ అందుబాటులోకి వచ్చేలా చూస్తామని వెల్లడించింది. విశాఖ ఉద్యోగుల సంఘం, కార్మిక సంఘాలు రూ.15 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ కోరగా... రూ.11,440 కోట్లు ఇస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. దీనికంటే ముందు రూ.1,650 కోట్లు అందజేసింది. అయితే సెయిల్‌లో విలీనం చేయాలనే తమ ప్రధాన డిమాండ్‌ను పట్టించుకోలేదని సీఐటీయూ వంటి కార్మిక సంఘాలు తటస్థ వైఖరి అవలంబించగా మిగిలిన సంఘాలన్నీ ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నాయి. స్టీల్‌ప్లాంటుకు కష్టాలు తొలగిపోయినట్టేనని, ఇక అన్నీ మంచిరోజులేనని సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించడంతో వైసీపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. వైసీపీ హయాంలో స్టీల్‌ప్లాంటుకు రూపాయి కూడా సాయం చేయకపోవడమే దీనికి కారణం.

కూటమి నేతలు సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులంతా స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని, ఆర్థిక సాయం కోసం ప్రయత్నం చేస్తామని కార్మిక, ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటిరోజు నుంచే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఆరు నెలల వ్యవధిలో రూ.1,650 కోట్ల సాయం వచ్చేలా చేశారు. ఇప్పుడు భారీ ప్యాకేజీ ఇచ్చేలా ఢిల్లీ పెద్దలను ఒప్పించారు. ఇటీవల ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు స్టీల్‌ ప్లాంటు గురించి మాట్లాడలేదని, సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కూడా ఈ సమస్యను ప్రస్తావించలేదని విమర్శలు చేసిన రాజకీయ, కార్మిక సంఘ నాయకులు ఇప్పుడు నోరు మెదపలేకపోతున్నారు.

జీతాలు అందుతాయి...ఉద్యోగాలు నిలుస్తాయి

ఇన్నాళ్లూ ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాలు కొనుగోలు చేయడానికి నిధులు అందుబాటులో లేక స్టీల్‌ అమ్మగా వచ్చిన మొత్తాలన్నీ సరఫరాదారులకు ఇచ్చేశారు. దాంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేంద్రం రూ.11,440 కోట్లు సాయం చేయడం వల్ల ముడి పదార్థాలకు నిధుల లభ్యత పెరుగుతుంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే సౌలభ్యం కలుగుతుంది. గతంలో మాదిరిగానే నెలాఖరున జీతాలు అందుకునే పరిస్థితి వస్తుంది. మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కూడా ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించిన నేపథ్యంలో 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి దిశగా కర్మాగారం ప్రయాణం మొదలవుతుంది. దీనివల్ల ఉద్యోగులకు భద్రత లభిస్తుంది.

యాజమాన్యం ప్రస్తుతం వీఆర్‌ఎస్‌కు దరఖాస్తులు ఆహ్వానించింది. భవిష్యత్తుపై ఆందోళనతో 370 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్యాకేజీ రావడంతో అత్యధికులు వీఆర్‌ఎస్‌కు మొగ్గుచూపరనే వాదన వినిపిస్తోంది. అనారోగ్యం, తక్కువ సర్వీస్‌ ఉన్నవారు తప్పితే మిగిలిన వారు కొనసాగుతారని ఉద్యోగ సంఘాలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నాయి. ఉత్పత్తికి అవసరమైన ఐరన్‌ఓర్‌ను ఎన్‌ఎండీసీని అందించి, అదానీ గంగవరం పోర్టు నుంచి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటే అనుకున్న ఉత్పత్తి సాధిస్తామని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

స్టీల్‌ప్లాంటుకు మంచి రోజులు

పల్లా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే

కష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్‌ప్లాంటుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో మంచి రోజులు రానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత ఏడు నెలలుగా పదే పదే స్టీల్‌ప్లాంటు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఆర్థిక ప్యాకేజీ ఇప్పించగలిగారు. గత ముఖ్యమంత్రి జగన్‌ అధికారాన్ని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారే తప్ప...ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు ఏమీ చేయలేదు. అటువంటిది అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే చంద్రబాబునాయుడు స్టీల్‌ప్లాంటు విషయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడం శుభపరిణామన్నారు. ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఉక్కుశాఖా మంత్రి హెచ్‌డి.కుమారస్వామికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల తరుపున ధన్యవాదాలు.

ప్రజల విజయం

జె.అయోధ్యరామ్‌, సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు

స్టీల్‌ప్లాంటుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ప్రజల విజయం. అయితే సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. గత నాలుగేళ్లుగా ఉద్యమాన్ని నడుపుతున్నాం. చంద్రబాబునాయుడు నాయకత్వంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్యాకేజీ తేవడం మంచి విషయం. ప్లాంటును సెయిల్‌లో విలీనం చేస్తేనే మనుగడ సాధ్యపడుతుంది.

సొంత గనులు కూడా కేటాయించాలి

మంత్రి రాజశేఖర్‌, ఇంటక్‌ జాతీయ కార్యదర్శి

విశాఖ స్టీల్‌ ప్లాంటుకు ఆర్థిక సహాయం అందించడం మంచి విషయం. ఈ సాయంతో ఓ ప్రణాళిక ప్రకారం ముందుకుసాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ప్లాంటుకు ప్రధాన సమస్య గనులే. అవి కూడా కేటాయిస్తే బాగుణ్ణు. ప్లాంటు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌ఎండీసీలో గానీ, సెయిల్‌లో గానీ విలీనం చేస్తే బాగుంటుంది.

Updated Date - Jan 18 , 2025 | 12:46 AM