Share News

ఆయిల్‌పామ్‌కు మంచి రోజులు

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:23 PM

ఆయిల్‌పామ్‌ సాగుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆయిల్‌పామ్‌ సాగుపై చూపించిన నిర్లక్ష్యం కారణంగా నిరాశ చెందిన రైతులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఉత్సాహంగా ఉన్నారు.

ఆయిల్‌పామ్‌కు మంచి రోజులు
చెట్ల నుంచి దించిన ఆయిల్‌పామ్‌ గెలలు

కూటమి ప్రభుత్వంలో మరింత ప్రోత్సాహం

రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ

అంతర పంటలకూ చేయూత

రికార్డు స్థాయిలో పెరిగిన ధర

గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం

చోడవరం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ సాగుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆయిల్‌పామ్‌ సాగుపై చూపించిన నిర్లక్ష్యం కారణంగా నిరాశ చెందిన రైతులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో రాయితీలు, డ్రిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యాల పరంగా రైతులకు తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుపై విముఖత చూపేవారు. డిప్‌ ఇరిగేషన్‌ సౌకర్యం సక్రమంగా లేకపోవడం, తోటలకు ఏడాదికి ఇచ్చే ఎరువులు, ఇతర నిర్వహణ ఖర్చుల రాయితీలు, మొక్కల రాయితీలు కూడా ప్రభుత్వం అప్పట్లో ఇవ్వకపోవడంతో రైతుల్లో నిరాసక్తత ఉండేది. దీంతో వీటి సాగు గత ఐదేళ్లలో తగ్గింది.

రైతులకు మరింత ప్రోత్సాహం

కూటమి ప్రభుత్వం వచ్చాక శతశాతం రాయితీపై మొక్కలు పంపిణీ చేస్తోంది. గతంలో రైతులు ఒక మొక్కకు రూ.133 చెల్లించేవారు. ఇప్పుడు ఉచితంగా పొందుతున్నారు. గతంలోలాగా కాకుండా ఇప్పుడు రైతులు దరఖాస్తు చేసిన వెంటనే డ్రిప్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఏడాదికి మొక్కల నిర్వహణ ఖర్చుల కింద హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగేళ్లలో రూ.21 వేలు రైతులకు ప్రభుత్వం అందజేస్తున్నది. గరిష్టంగా ఒక రైతుకు 35 ఎకరాల వరకు సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. ఒకటి నుంచి ఐదు ఎకరాల లోపు డ్రిప్‌ సౌకర్యం కోసం 90 శాతం రాయితీ, 5 ఎకరాల నుంచి 12.5 ఎకరాల వరకు 50 శాతం రాయితీ లభిస్తున్నది.

అంతర పంటలకూ తోడ్పాటు

ఆయిల్‌పామ్‌ తోటలు ఎదిగేంత వరకు నాలుగేళ్లలో తోటల మధ్య అంతర పంటలుగా అరటి, కూరగాయలు, జామ, ఇతర రకాల పంటలు వేసుకోవడానికి రెండు హెక్టార్ల వరకూ ప్రభుత్వం రాయితీ కింద ఏడాదికి హెక్టారుకు రూ.5 వేలు చొప్పున అందించనుంది. గతంలో ఇది ఒక్క హెక్టారుకు మాత్రమే ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీని పరిమితిని రెండు హెక్టార్లకు పెంచింది.

మూడు కంపెనీల ఆధ్వర్యంలో సాగు

జిల్లాలో ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ సాగు నాలుగు వేల హెక్టార్లలో ఉంది. జిల్లాలో మూడు కంపెనీల ఆధ్వర్యంలో ఈ ఆయిల్‌పామ్‌ సాగు అవుతున్నది. రుచి సోయా, శాంతి ఆయిల్‌పామ్‌ కంపెనీ, ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ కంపెనీలు మండలాల్లో తోటలను ప్రోత్సహిస్తున్నాయి. శాంతి ఆయిల్‌పామ్‌ కంపెనీ పరిధిలో మాడుగుల, చోడవరం, అనకాపల్లి, కశింకోట, బుచ్చెయ్యపేట, పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాలు ఉన్నాయి. గతంలో రుచిసోయా, ప్రస్తుతం పతంజలి కంపెనీ పరిధిలో దేవరాపల్లి, మునగపాక, రావికమతం, రోలుగుంట, నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, పాయకరావుపేట, యలమంలి, రాంబిల్లి, మాకవరపాలెం మండలాలు ఉన్నాయి. ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ కంపెనీలో చీడికాడ, చింతపల్లి మండలాలు ఉన్నాయి.

రికార్డు స్థాయిలో పెరిగిన ధర

ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ప్రోత్సాహానికి తగినట్టుగానే పెరిగిన ధర కూడా రైతుల్లో ఉత్సాహాన్ని ఇస్తున్నది. ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ టన్ను రూ.20,290 ధర పలుకుతోంది. గతంతో పోలిస్తే టన్నుకు రూ.4 వేలు నుంచి రూ.6 వేలు వరకూ ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:23 PM